Harish Rao: కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందన

  • కొత్త ట్రైబ్యునల్ అంశంపై నిన్న షెకావత్ ప్రెస్ మీట్
  • కేసీఆర్ వల్లే జాప్యం అంటూ వ్యాఖ్యలు
  • న్యాయంగా రావాల్సిన వాటానే కోరుతున్నామన్న హరీశ్ 
  • కేంద్రంతో తమకు ప్రత్యేక వివాదాలేమీ లేవని స్పష్టీకరణ
Harish Rao reacts to union minister Shekhawat comments on CM KCR

నీటి పంపకాలపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరేనంటూ నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై నేడు మంత్రి హరీశ్ రావు స్పందించారు. ట్రైబ్యునల్ అంశం నాలుగు నెలల నుంచే పెండింగ్ లో ఉందని షెకావత్ చెబుతున్నారని, వాస్తవానికి ఇది నాలుగు నెలల నుంచి కాదని ఏడేళ్ల నుంచి పెండింగ్ లో ఉందని స్పష్టం చేశారు. తాము చట్టవిరుద్ధమైన రీతిలో వ్యవహరించడం లేదని, రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన నీటి వాటానే కోరుతున్నామని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతర్రాష్ట్ర నదీజలాల అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఫిర్యాదు చేసిన సంవత్సరంలోపే సమస్య పరిష్కరించాలని చట్టంలో ఉన్నా, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్ ఆరోపించారు.

"సమస్య పరిష్కారం కాకపోతే ట్రైబ్యునల్ కు నివేదించాలి. కానీ సంవత్సరం పాటు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లే మేం 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టులో కేసు ఎలాంటి ఇబ్బందులు కలిగించదు. అసలు కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం వల్లే కదా మేం సుప్రీంకోర్టుకు వెళ్లింది? కేంద్రం నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలనే సుప్రీంకోర్టును కోరాం. ఇకనైనా కేంద్రం స్పందించాలన్నదే మా ఆకాంక్ష.

నీటి వాటాలకు సంబంధించిన అంశాన్ని ఇప్పుడున్న బ్రిజేశ్ ట్రైబ్యునల్ కు అనుసంధానం చేయడమో లేక కొత్త ట్రైబ్యునల్ ప్రకటించడమో చేయాలి" అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తాము కేంద్రమంత్రి షెకావత్ ను వ్యక్తిగతంగా ఏమీ అనడంలేదని, రాష్ట్ర ప్రయోజనాల రీత్యానే తాము ఆవేదన వెలిబుచ్చుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రంతో తమకు ప్రత్యేకమైన వివాదాలేమీ లేవని అన్నారు.

More Telugu News