Devasahayam Pillai: 18వ శతాబ్దం నాటి భారతీయుడికి సెయింట్ హోదా ప్రకటిస్తున్న వాటికన్

  • 1712లో జన్మించిన దేవసహాయం పిళ్లై
  • క్రైస్తవ మతం స్వీకరించి సమానత్వం కోసం పోరాడిన పిళ్లై
  • నిర్బంధించిన అగ్రవర్ణాలు
  • కాల్పుల్లో మరణించిన పిళ్లై
  • వచ్చే ఏడాది సెయింట్ హుడ్ ప్రకటించనున్న పోప్
Vatican announced Indian man Devasahayam Pillai Sainthood

భారతదేశానికి చెందిన దేవసహాయం పిళ్లై అనే క్రైస్తవుడికి అత్యంత విశిష్టమైన సెయింట్ హోదా దక్కింది. దేవసహాయం పిళ్లై 18వ శతాబ్దం నాటి వ్యక్తి. 3 శతాబ్దాల అనంతరం ఆయనకు సెయింట్ హుడ్ లభించడం విశేషం. దేవసహాయం పిళ్లై 1712 ఏప్రిల్ 23న అప్పటి ట్రావెన్ కూర్ సంస్థానం పరిధిలోని కన్యాకుమారి ప్రాంతంలో జన్మించారు. నాయర్ల కుటుంబంలో జన్మించిన ఆయన 1745లో క్రైస్తవ మతంలో అడుగుపెట్టారు. తన పేరును లాజరస్ గా మార్చుకుని, సామాజిక సమానత్వం కోసం అప్పట్లోనే ఎలుగెత్తారు.

అయితే, నాడు అగ్రవర్ణాల ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆయనను నిర్బంధించారు. 1752లో దేవసహాయం పిళ్లైని చంపేశారు. మానవతావాదిగా దైవ ప్రబోధానుసారం సమానత్వం కోసం తన గళాన్ని వినిపించడంలో ఎంతో కృషి చేశారని, చివరికి ప్రాణత్యాగం చేశారంటూ వాటికన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. దేవసహాయం పిళ్లైకి సెయింట్ హోదా ఇస్తున్నట్టు వెల్లడించాయి. వచ్చే ఏడాది మే 15న జరిగే ఓ కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, భారత్ లో మతగురువు కాకుండా ఓ సామాన్య క్రైస్తవుడికి సెయింట్ హోదా లభించడం ఇదే ప్రథమం.

More Telugu News