Supreme Court: లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ... యూపీ సర్కారుపై తీవ్ర అసంతృప్తి

  • లఖింపూర్ లో రైతులపై కారు పోనిచ్చిన కేసు
  • విచారణ తీరు ఏమాత్రం బాగాలేదన్న సుప్రీంకోర్టు
  • రిటైర్డ్ జడ్జిలు దర్యాప్తు చేయాలని వెల్లడి
  • ఇద్దరు పేర్లను సిఫారసు చేసిన సీజేఐ ధర్మాసనం
Supreme Court questions Uttar Pradesh govt over Lakhimpur issue

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో రైతులపై కారుతో దూసుకుపోయి, పలువురి మృతికి కారణమైన వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విచారణ కొనసాగుతున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు సాక్షుల్ని విచారించాం అనే మాట తప్ప నివేదికలో అంతకుమించిన వివరాలు లేవని, కేసు పురోగతి ఏ విధంగా ఉందో ఈ నివేదిక చెప్పకనే చెబుతోందని విమర్శించింది.

ఈ క్రమంలో, నిందితుల ఫోన్ కాల్ డేటా సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులు సేకరించిన ఇతర ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఇతర కేసుల సాక్ష్యాలను ఈ కేసుకు ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. కాగా, కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసేందుకు సుప్రీం ధర్మాసనం నేటి విచారణలో నిరాకరించింది.

యూపీ నియమించిన న్యాయ కమిషన్ పై నమ్మకంలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. రెండు ఎఫ్ఐఆర్ లను కలిపి విచారించడం చూస్తుంటే నిందితుడికి ఊరట కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల జడ్జిల పర్యవేక్షణలో కేసు విచారణ జరగాలని అభిప్రాయపడింది.

ఈ క్రమంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్ ల పేర్లను సిఫారసు చేసింది. ఈ ఇద్దరు జడ్జిల్లో ఒకరి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. శుక్రవారంలోగా అభిప్రాయం చెప్పాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు సీజేఐ ధర్మాసనం పేర్కొంది.

More Telugu News