Kollywood: సినీ నటుడు విజయ్ సేతుపతిని తన్నిన వారికి బహుమతి ఇస్తామంటూ ప్రకటించిన హిందూ మక్కల్ కచ్చి

  • ఒక తన్నుకు రూ. 1,001 బహుమతి
  • సేతుపతి ఈ దేశాన్ని, తేవర్ అయ్యను అవమానపరిచారు
  • క్షమాపణలు చెప్పే వరకు తంతూనే ఉండాలి
  • మహాగాంధీతో అవమానకరంగా మాట్లాడారు
HMK announces cash prize for anyone who kicks actor Vijay Sethupathi

బెంగళూరు విమానాశ్రయంలో ఇటీవల ప్రముఖ తమిళ నటుడు విజయ్‌సేతుపతిపై జరిగిన దాడి సంచలనం సృష్టించింది. విమానాశ్రయంలో నడిచి వెళ్తున్న నటుడిని వెనక నుంచి వచ్చి ఓ వ్యక్తి ఎగిరితన్నిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే, ఈ ఘటనను చాలా చిన్న విషయంగా నటుడు కొట్టిపడేశారు.

ఆ ఘటనకు అక్కడితో ఫుల్‌స్టాప్ పడిందని అనుకుంటున్న వేళ ‘హిందూ మక్కల్ కచ్చి’ (హెచ్ఎంకే) సంస్థ సంచలన ప్రకటన చేసింది. విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. విజయ్ సేతుపతిపై విమానాశ్రయంలో జరిగిన దాడికి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన హెచ్ఎంకే.. స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పాసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘తేవర్ అయ్యను అవమానపరిచిన విజయ్ సేతుపతిని తన్నిన వారికి అర్జున్ సంపత్ నగదు బహుమతి ప్రకటించారు. క్షమాపణలు చెప్పే వరకు ఆయనను తన్నాలి. ఒక తన్నుకు రూ. 1,001 బహుమతి’’ అని హెచ్ఎంకే ట్వీట్ చేసింది.  

హెచ్ఎంకే చీఫ్ అర్జున్ సంపత్ మాట్లాడుతూ.. ఆ ప్రకటన ఇచ్చింది తానేనని అంగీకరించారు. విజయ్ సేతుపతిని తన్నిన మహాగాంధీతో తాను మాట్లాడినట్టు చెప్పారు. నటుడు తనతో హేళనగా మాట్లాడడంతో వాగ్వివాదం జరిగిందని అతడు తనతో చెప్పినట్టు తెలిపారు.

‘‘విజయ్ సేతుపతికి జాతీయ అవార్డు రావడంతో మహాగాంధీ ఆయనను అభినందించాలని అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి ఆయనతో వ్యంగ్యంగా మాట్లాడడంతో మహాగాంధీ అవాక్కయ్యారు. అయినప్పటికీ పట్టించుకోని మహాగాంధీ..  ‘మీరు దక్షిణాది జిల్లాలకు చెందిన వారు కావడంతో పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ పూజకు రావాలని’  ఆహ్వానించారు. దీంతో మండిపడిన  విజయ్ సేతుపతి మరోమారు వెటకారంగా మాట్లాడారు.

ఈ ప్రపంచానికి ఒకే ఒక్క తేవర్ (దేవుడు)  జీసస్ మాత్రమేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వారి మధ్య వాగ్వివాదానికి దారితీశాయి. పసుంపోన్‌ను, దేశాన్ని నటుడు అవమానించాడు’’ అని సంపత్ మండిపడ్డారు. మహాగాంధీతో నేరుగా మాట్లాడిన తర్వాతే నగదు బహుమతిని ప్రకటించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. విజయ్ సేతుపతి అలా మాట్లాడకుంటే మహాగాంధీ ఆరోపణలను ఆయన ఎందుకు ఖండించలేదని అర్జున్ సంపత్ ప్రశ్నించారు.

More Telugu News