Sadhguru Jaggi Vasudev: రోజుకు 20 కోట్ల జంతువులను చంపేస్తూ.. పిల్లలకు ఒక్క రోజు ఆనందాన్ని దూరం చేస్తారా?: సద్గురు జగ్గీ వాసుదేవ్

  • దీపావళి రోజు ఎక్కడలేని జంతుప్రేమ వచ్చేస్తుంది
  • ఒక్క రోజు మాంసాహారం తినడం సగానికి తగ్గిస్తే 100 మిలియన్ జంతువులు బతుకుతాయి
  • మీరు తినే కబాబ్ ఇంతకుముందు ఓ జంతువన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి
  • మానవశ్రేయస్సు కోసం మాట్లాడేముందు తొలుత పరిష్కారం ఆలోచించండి
Sadhguru Jaggi Vasudev Slams firecracker ban

దీపావళిని పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కు సంబంధించి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. కాలుష్యం పేరుతో విధించిన బాణసంచా నిషేధంపై ఆయన తీవ్రంగా స్పందించారు. పిల్లల కోసమైనా టపాసులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన కోరారు.

"మీరు జంతు ప్రేమికులు అయితే, పర్యావరణ పరంగా సున్నిత మనస్కులు అయితే రోజువారీ మాంసాహార వినియోగాన్ని తగ్గించండి. ఒక్క రోజు పిల్లల ఆనందాన్ని దూరం చేయకండి’’ అని సద్గురు అందులో పేర్కొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో సద్గురు ఇంకా మాట్లాడుతూ.. ‘‘దీపావళి రాగానే ఒక్కసారిగా అకస్మాత్తుగా పశుపక్ష్యాదులపై విపరీతమైన ఆందోళన పుట్టుకొచ్చేస్తుంది. ఆహారం కోసం ఈ గ్రహంపై ప్రతిరోజూ 200 మిలియన్ జంతువులను వధిస్తున్నారు. మనం కనుక మాంసాహారాన్ని తీసుకోవడం సగానికి తగ్గిస్తే ప్రతి రోజు పది కోట్ల జంతువులను రక్షించవచ్చు. మీరు కనుక జంతు ప్రేమికులైతే అలా చేయండి’’ అని ఆ వీడియోలో సద్గురు పేర్కొన్నారు.

‘‘మీరు ఒకసారి కబేళాలకు వెళ్లి చూస్తే మీరు తినే కబాబ్ ఇంతకుముందు ఓ జంతువు అని తెలుస్తుంది. అలాగే, మీరు ఎంతో ఇష్టంగా తినే బీఫ్ రోస్ట్ ఓ జంతువు అని, చికెన్ ఓ పక్షి అని మీకు అర్థమవుతుంది’’ అని వివరించారు. అంతకుముందు సద్గురు ఓ ట్వీట్ చేస్తూ.. సమస్యలకు పరిష్కారాలు కనుగొనకుండా మానవశ్రేయస్సు కోసం మాట్లాడడం సరికాదని అన్నారు. మానవుల్లో స్పృహను పెంచడం ద్వారా మాత్రమే ఈ భూమిపై పర్యావరణ స్థితిని పునరుజ్జీవింపజేయగలమని అన్నారు.

కాలుష్యం గురించి ఆందోళన చెందుతున్న వారికి సద్గురు ఓ ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారు. వాయుకాలుష్యం గురించి ఆందోళన చెంది పిల్లలకు పటాసుల ఆనందాన్ని దూరం చేయడం సరికాదని, వారి కోసం పెద్దలు త్యాగం చేయాలని, మూడు రోజులు వాహనాలను పక్కనపెట్టేసి కార్యాలయాలకు నడిచివెళ్లాలని సూచించారు. పిల్లలకు మాత్రం టపాసుల ఆనందాన్ని అందించాలని సద్గురు కోరారు.

More Telugu News