ICC T20 World Cup: నమీబియాను చిత్తు చేసిన పాకిస్థాన్.. దర్జాగా సెమీఫైనల్‌లోకి

  • వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన పాక్
  • రిజ్వాన్, బాబర్ ఆజం సూపర్ షో
  • రిజ్వాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
Openers Super Show Pak enters Semi Finals

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్ ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజం కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 113 పరుగులు జోడించడంతో మరోమారు భారీ స్కోరు సాధించింది.

50 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులతో అజేయంగా నిలవగా, ఆజం 49 బంతుల్లో 7 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. హఫీజ్ 16 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 190 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియా గట్టిగా పోరాడినప్పటికీ అనుభవలేమి కారణంగా ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ (29), క్రెయిగ్ విలియమ్స్ (40), డేవిడ్ వీజ్ 43 (నాటౌట్) పరుగులు చేశారు. గ్రూప్ 2లో వరుసగా నాలుగో విజయం సాధించిన పాకిస్థాన్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. రిజ్వాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడిపోయిన నమీబియాకు సెమీస్ అవకాశాలు దాదాపు దూరమైనట్టే.

More Telugu News