Dinosaur: ఐక్యరాజ్యసమితిలో 'డైనోసార్' ప్రసంగం.. 'ఇప్పటికైనా మారండి' అంటూ మెసేజ్.. ఇదిగో వీడియో

  • పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి వినూత్న చర్య
  • డైనోసార్ తో ‘మానవ అంతం’పై సందేశం
  • మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటూ సూచన
  • శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలని హితవు
Dinosaur Message On Human Extinction In UN

అది ఐక్యరాజ్య సమితి సమావేశం జరుగుతున్న మందిరం. ఇంతలో అక్కడికి ఓ డైనోసార్ వచ్చింది. అంతా ఉలిక్కి పడ్డారు. అది సరిగ్గా వేదిక వద్దకు వెళ్లింది. మైకును సరి చేసింది. గొంతును సవరించుకుంది. 'ప్రజలారా వినండి..' అంటూ మొదలుపెట్టింది. అవును.. మీరు చదువుతున్నది నిజమే.

రోజురోజుకూ భూతాపం పెరిగిపోతోంది కదా. మనం వాడే శిలాజ ఇంధనాలతో కర్బన ఉద్గారాలు గాల్లో కలిసి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వాటి వాడకాన్ని తగ్గించాలని, ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలని లక్ష్యాన్నీ ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. అయితే, ఈ పర్యావరణ మార్పులపై తాజాగా ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. అంతరించిపోయిన డైనోసార్లతో.. జనం అనే మనం కూడా అంతరించిపోతామని హెచ్చరిక ఇప్పించింది. గ్రాఫిక్స్ తో ఓ డైనోసార్ ను రూపొందించి.. నిజంగా ఓ డైనోసార్ మనముందు మాట్లాడుతోందన్న భ్రాంతిని కలిగించింది.

ఇక ఆ డైనోసార్ చెప్పిందేంటంటే..

‘‘ప్రజలారా వినండి! మీరంతా పర్యావరణ విపత్తు దిశగా అడుగులేస్తున్నారు. పెద్ద పెద్ద ఉల్కలపై అంతే మొత్తాన్ని మనం ఖర్చు చేస్తున్నామనుకోండి.. ఏమవుతుంది? ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వాలు లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పేదరికంలో జీవిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా వినాశనంపై ఖర్చు చేయడానికి బదులు.. ఇలాంటి పేదలకు సాయం చేస్తే బాగుంటుందనిపించలేదా ఎప్పుడూ? మీ అంతం కోసం మీరే డబ్బులు ఖర్చు చేసుకుంటారా?

ఇప్పటికైనా మించిపోయింది లేదు. మహమ్మారి నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే మీ ఆర్థిక వ్యవస్థలను పటిష్ఠం చేసుకుంటున్నారు. కాబట్టి మీకిదే నేనిచ్చే ఓ మంచి సలహా. మీ అంతాన్ని మీరే కోరుకోకండి. సమయం మించిపోకముందే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పటికైనా మార్పులను ఆహ్వానించండి.. మారండి. దాని నుంచి తప్పుకునేందుకు వంకలు వెతుక్కోవద్దు. థాంక్యూ’’ అంటూ ఆ గ్రాఫిక్స్ డిజైనర్ డైనోసార్ తన ప్రసంగాన్ని ముగించేసింది. అంతే హాలు హాలంతా చప్పట్లతో మార్మోగి పోయింది.

More Telugu News