Somu Veerraju: బద్వేల్ ఉప ఎన్నిక: ఎన్నికల సంఘం పరిశీలకుడు భీష్మకుమార్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

  • ఈ నెల 30న బద్వేల్ ఉప ఎన్నిక
  • పరిశీలనకు కడప జిల్లాకు వచ్చిన భీష్మకుమార్
  • కడపలో భీష్మకుమార్ ను కలిసిన సోము వీర్రాజు తదితరులు
  • స్థానిక పోలీసులతో ఎన్నికలు నిర్వహించడంపై ఫిర్యాదు
BJP leaders complains to general observer Bhishma Kumar in Kadapa

కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు భీష్మకుమార్ నేడు కడప జిల్లాకు విచ్చేశారు. ఈ నెల 30న బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన పరిశీలనకు వచ్చారు. ఈ నేపథ్యంలో, సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ బృందం భీష్మకుమార్ ను కలిసింది. బద్వేల్ ఉప ఎన్నికను స్థానిక పోలీసులతో నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది.

ఇప్పటికే పోలీసులు వైసీపీ నేతల కనుసన్నల్లో వ్యవహరిస్తూ, బీజేపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. చేసిన మంచి చెప్పి ఓట్లు అడగకుండా... అధికారంతో భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు.

ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు, మంత్రుల సహకారంతో స్థానిక వైసీపీ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర బలగాలతో పరేడ్ నిర్వహించి ఓటర్లలో విశ్వాసం కలిగించాలని కోరారు. అన్నిస్థాయుల నుంచి స్థానిక పోలీసులను తప్పించాలని విన్నవించారు.

కడపలో భీష్మకుమార్ ను కలిసిన వారిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు ఉన్నారు.

More Telugu News