Sri Lanka: టీ20 ప్రపంచకప్: నమీబియాపై శ్రీలంక ఘన విజయం

  • శ్రీలంక బౌలర్లను ఎదుర్కోలేక చేతులెత్తేసిన నమీబియా
  • మూడు వికెట్లతో అదరగొట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ తీశంక
  • 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో లంక విజయం
Sri Lanka smashed Namibia In their first match

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి నమీబియాతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్దేశించిన 97 పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక 13.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అవిష్క ఫెర్నాండో 28 బంతుల్లో 2 సిక్సర్లతో 30 పరుగులు, భానుక రాజపక్స 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఫలితంగా మరో 6.3 ఓవర్లు ఉండగానే శ్రీలంక విజయాన్ని అందుకుని టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 96 పరుగులకు కుప్పకూలింది. అనుభవజ్ఞులైన లంక బౌలర్లను ఎదుర్కోలేక నమీబియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఎం.తీశంక, లహిరు కుమార, హసరంగ నిప్పులు చెరిగే బంతులకు క్రీజులో నిలవలేకపోయారు. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే నమీబియా ఆలౌట్ అయింది. క్రెయిగ్ విలియమ్స్ (29), కెప్టెన్ ఇరాసుమస్ (20) మాత్రమే క్రీజులో కాసేపు కుదురుకోగలిగారు. వీరి తర్వాత అత్యధిక పరుగులు చేసింది స్మిత్ (12) మాత్రమే.

మిగతా వారిలో ఎవరూ కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో తీశంక 3 వికెట్లు పడగొట్టగా, లహిరు కుమార, హసరంగ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కరుణరత్నే, చమీరకు చెరో వికెట్ దక్కాయి. తీశంకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రపంచకప్‌లో నేడు స్కాట్లాండ్-పపువా న్యూ గినియా, ఒమన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

More Telugu News