UNICEF: ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది.. చేతులు శుభ్రం చేసుకోవడానికీ నోచుకోవడం లేదట!

  • ‘ఇంటర్నేషనల్ హ్యాండ్ వాష్ డే’ సందర్భంగా నివేదిక విడుదల
  • అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు చేతులు శుభ్రం చేసుకోవడానికి దూరం
  • ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం బడుల్లో సబ్బు, నీరు మృగ్యం
230 crore people away from hand hygien

యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) తాజాగా వెల్లడించిన విషయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ‘ఇంటర్నేషనల్ హ్యాండ్ వాష్ డే’ సందర్భంగా విడుదల చేసిన ఈ నివేదిక ఆలోచనలో పడేసింది. ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా నోచుకోవడం లేదట. అభివృద్ధికి దూరంగా ఉన్న దేశాల్లో ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి దేశాల్లో ప్రతి పదిమందిలో ఆరుగురికి చేతులు కడుక్కోవడానికి అవసరమైన సబ్బు, నీరు వంటివి కూడా అందుబాటులో లేవని పేర్కొంది. కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత ఈ పరిస్థితి మరింత పెరిగినట్టు వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా 40 శాతం పాఠశాలల్లో పిల్లలు చేతులు శుభ్రం చేసుకునేందుకు అవసరమైన సబ్బు, నీరు వంటివి అందుబాటులో లేవని యూనిసెఫ్ తాజా నివేదిక పేర్కొంది. ఇది దాదాపు 81.80 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. అలాగే, అంతగా అభివృద్ధి చెందని దేశాల్లోని 70 శాతం పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అంతేకాదు, ప్రపంచంలోని మూడింట ఒకవంతు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనూ చేతులను శుభ్రం చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు లేవని వివరించింది. ఇక, ఇళ్లలో చేతులు శుభ్రం చేసుకునే సదుపాయం లేనివాళ్లు 67 శాతం నుంచి 71 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ దశాబ్దం చివరి నాటికి ఈ సంఖ్య 190 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

More Telugu News