Electric Vehicle: ‘మేడిన్ తెలంగాణ’ ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1,200 కిలోమీటర్ల జర్నీ.. లాంచ్ చేసిన అమెరికా కంపెనీ!

  • ఎలక్ట్రిక్ కార్ ‘హెచ్’ ఎస్ యూవీ లాంచ్
  • ఆ రేంజ్ ఉన్న దేశంలోనే తొలి ఈవీగా రికార్డ్
  • జహీరాబాద్ ప్లాంట్ లో రూపొందిన కార్
  • వెల్లడించిన ట్రైటాన్ ఎండీ హిమాన్షు
  • ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్లాంట్
Triton Launches Made In Telangana Electric Car That Ranges 1200 km

అమెరికాకు చెందిన విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్ ఈవీ.. దేశంలో ఈవీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రైటాన్ కంపెనీ తన ఈవీ అయిన ‘హెచ్’ ఎస్ యూవీని లాంచ్ చేసింది. భారత్ లోనే ఆ సంస్థ లాంచ్ చేస్తున్న తొలి కారు ఇదే కావడం విశేషం.  

భారీ సైజుతో ఆకట్టుకునే రూపంలో ఉన్న ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే ఆగకుండా 1,200 కిలోమీటర్లు దూసుకెళ్లవచ్చని ట్రైటాన్ సంస్థ చెబుతోంది. కారు పొడవు 5,690 మిల్లీ మీటర్లు కాగా.. ఎత్తు 2,057 మిల్లీమీటర్లు, వెడల్పు 1,880 మిల్లీ మీటర్లు అని పేర్కొంది. కారు వీల్ బేస్ 3,302 మిల్లీమీటర్లు అని చెప్పింది. 8 మంది సులభంగా ప్రయాణించేందుకు వీలుంటుంది. 200 ఘనపుటడుగుల (5,663 లీటర్ల) మేర లగేజీని పెట్టుకోవచ్చని తెలిపింది.

200 కిలోవాట్ అవర్ సామర్థ్యమున్న బ్యాటరీతో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చని, కేవలం రెండు గంటల్లోనే చార్జింగ్ నింపొచ్చని సంస్థ వెల్లడించింది. కంపెనీ చెబుతున్నట్టు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెట్టి.. 1,200 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. దేశంలో వెయ్యి కిలోమీటర్ల రేంజ్ ఉన్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే అవుతుంది. కాగా, మేకిన్ ఇండియాలో భాగంగా తెలంగాణలోని జహీరాబాద్ లో ఫ్యాక్టరీలో ఈ కారును తయారు చేశామని సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు బి. పటేల్ తెలిపారు. అమెరికా తర్వాత సంస్థకు చెందిన అతిపెద్ద ఈవీ తయారీ ప్లాంట్ ఇదేనని ఆయన చెప్పారు.

More Telugu News