Imran Khan: ఐఎస్ఐ చీఫ్ ను మార్చిన సైన్యం.... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆగ్రహం

  • పాక్ సర్కారు, సైన్యం మధ్య విభేదాలు
  • ఐఎస్ఐ చీఫ్ ను పెషావర్ కోర్ కు బదిలీ చేసిన ఆర్మీ చీఫ్
  • నోటిఫికేషన్ జారీ చేయని సర్కారు
  • ఆర్మీ చీఫ్ తో మాట్లాడిన ప్రధాని ఇమ్రాన్
Differences between Pakistan govt and Army

పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య చాన్నాళ్ల తర్వాత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇటీవల పాక్ సైన్యం ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ ను బదిలీ చేయడమే అందుకు కారణం. ఈ బదిలీపై కినుక వహించిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇంతవరకు ఉత్తర్వుల అమలు నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఐఎస్ఐ చీఫ్ ను పెషావర్ కోర్ కు బదిలీ చేస్తూ ఆర్మీ చీఫ్ కమర్ బజ్వా ఉత్తర్వులను పాక్ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు. పైగా, ఐఎస్ఐ చీఫ్ గా ఫయాజ్ హమీద్ ను కొనసాగించాల్సిందేనని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వైఖరి స్పష్టం చేశారు.

ఫయాజ్ హమీద్... పాక్ ప్రధాని ఇమ్రాన్ కు అత్యంత దగ్గర వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడంలో హమీద్ ముఖ్య భూమిక పోషించారు. తమ మాట వినకపోతే బెదిరించైనా సరే పీటీఐ పార్టీలో చేర్పించేవాడని హమీద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇంతటి నమ్మకస్తుడు కీలక పదవిలో ఉండాలన్నదే ప్రధాని ఇమ్రాన్ అభిమతం. ఈ విషయాన్ని ఆయన ఆర్మీ చీఫ్ కమర్ బజ్వాతో చర్చించారు. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నా, సైన్యం స్పందన ఇంకా తెలియరాలేదు.

More Telugu News