CBI: డేరా బాబా హంతకుడే.. దోషిగా తేల్చిన కోర్టు

  • ఈ నెల 12న శిక్ష విధించనున్న పంచకుల సీబీఐ కోర్టు
  • అతడితో పాటు మరో ఐదుగురు దోషులు
  • ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా బాబా
CBI Court Convicts Dera Baba In Murder Case

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం హంతకుడేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ మేరకు 2002 జులై 10 నాటి హత్య కేసుపై ఇవాళ తీర్పును వెలువరించింది. 2002లో డేరా సచ్చా సౌధలో ఒక అనుచరుడైన రంజీత్ సింగ్ హత్యకు గురయ్యాడు. రంజీత్ సింగ్ కుమారుడు జగ్షీర్ సింగ్ ఫిర్యాదు మేరకు 2003 డిసెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సీబీఐ కోర్టు విచారిస్తోంది.

అయితే, ఆ కేసును వేరే సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను రెండు రోజుల క్రితం న్యాయమూర్తులు కొట్టేశారు. బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో తాజాగా పంచకులలోని సీబీఐ కోర్టు కేసులో తీర్పును వెలువరించింది. డేరా బాబాతో పాటు మరో ఐదుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 12న శిక్షను విధించనుంది.

కాగా, ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులోనూ కోర్టు అతడిని 2019లో దోషిగా ప్రకటించింది. బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం దొంగతనం కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు.

More Telugu News