Malaria: మలేరియాకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్.. డబ్ల్యూహెచ్ వో ఆమోదం

  • ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01కు ఆమోదం
  • 3 ఆఫ్రికా దేశాల్లోని పిల్లలపై ట్రయల్స్
  • 8 లక్షల మందికి టీకా ఇచ్చిన డబ్ల్యూహెచ్ వో
  • 5 నెలల వయసు నుంచి 4 డోసులుగా వ్యాక్సిన్
WHO Approves Worlds First Malaria Vaccine

మలేరియా.. ప్రపంచంలో ఏటా కొన్ని కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న జబ్బు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) లెక్కల ప్రకారం 2019లో 22.9 కోట్ల మంది దాని బారిన పడగా.. 4.09 లక్షల మంది బలయ్యారు. చనిపోయిన వారిలో 67 శాతం మంది (2.74 లక్షలు) ఐదేళ్లలోపు పిల్లలే ఉండడం మరింత కలచివేసే విషయం. దాని నుంచి విముక్తి కల్పించేందుకు ఎన్ని మందులొచ్చినా ఫలితం ఉండట్లేదు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో కేసులు తీవ్రంగా ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే మలేరియాకు ప్రపంచంలోనే తొలి టీకా వచ్చేసింది. 2019 నుంచి ఆఫ్రికాలోని 8 లక్షల మంది పిల్లలపై చేస్తున్న ట్రయల్స్ లో వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపించడంతో డబ్ల్యూహెచ్ వో దానికి ఆమోదం తెలిపింది. ‘ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01 (మాస్క్విరిక్స్ బ్రాండ్ నేమ్)’ అనే వ్యాక్సిన్ ను ప్రపంచమంతా వినియోగించేందుకు డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ పచ్చజెండా ఊపారు. నాలుగు డోసులుగా పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. తొలి డోసును పిల్లలకు ఐదు నెలల వయసులో వేయాలన్నారు.

కాగా, ఇప్పటిదాకా 23 లక్షల డోసుల వ్యాక్సిన్ ను కెన్యా, ఘనా, మలావిల్లోని చిన్నారులకు ఇచ్చినట్టు చెప్పారు. వ్యాక్సిన్ 30 శాతం ప్రభావవంతంగా ఉందని టెడ్రోస్ చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో 90 శాతం మందిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ ధర కూడా తక్కువేనని చెప్పారు. కాగా, ఈ వ్యాక్సిన్ కు పైలట్ ప్రోగ్రాం కింద డబ్ల్యూహెచ్ వోకు చెందిన వ్యాక్సిన్ గ్రూప్ గావి ఆర్థిక సహకారం అందిస్తోంది.

More Telugu News