YS Sharmila: ఒకవేళ జగన్ సీఎంగా ఉండలేని పరిస్థితి వస్తే...: షర్మిల స్పందన

  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో షర్మిల
  • ఆసక్తికరంగా సమాధానాలు వెల్లడి
  • అనేక సంగతులు వివరించిన షర్మిల
  • పెళ్లి ముచ్చట్లు పంచుకున్న వైనం
Sharmila opines on many topics

సోదరుడు జగన్ గెలుపు కోసం ఎంతో కృషి చేశానన్న వైఎస్ షర్మిల, ఇప్పుడు వారికి తన అవసరం లేదని పేర్కొన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నిజంగానే ఇప్పుడు తన అవసరం లేదని, తన సోదరుడు సీఎం అయ్యాక, వైసీపీ పాలన కొనసాగుతున్న సమయంలో తాను చేయడానికి ఏముంటుందని అభిప్రాయపడ్డారు.

జగన్ కొన్ని కేసుల నేపథ్యంలో సీఎంగా ఉండలేని పరిస్థితి వస్తే వారి పార్టీ పరంగా, రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పుడు రాచరికాలు లేవని, ఓ వ్యక్తి పదవి కోల్పోతే వారి కుటుంబీకులకే ఆ పదవి దక్కాలని ఇప్పుడు ఆశించలేమని వివరించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి తదుపరి సీఎం ఎవరన్నది పార్టీ విధివిధానాలు నిర్ణయిస్తాయని తెలిపారు. తాను ఆ పార్టీలో కనీసం సభ్యురాలిని కూడా కాదని పేర్కొన్నారు. వారు ఎప్పుడూ తనకు ఒక పదవి ఇచ్చింది లేదని అన్నారు.

ఈ క్రమంలో ఆర్కే ఓ ప్రశ్న అడిగారు. జగన్ మిమ్మల్ని రాజ్యసభకు పంపుతానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పినట్టు చెప్పుకుంటున్నారు... దీనిపై మీరేమంటారు? అని అడిగారు. అందుకు షర్మిల బదులిస్తూ, ఆ విషయం తనకు తెలియదని, తాను ఎప్పుడూ రాజ్యసభ సీటు కోరలేదని అన్నారు. విన్న ప్రతి విషయం నిజం కాదని పేర్కొన్నారు.

ఇక, కుటుంబాల్లో ఆస్తుల గొడవలు సాధారణమేనని, వాటిని త్వరలోనే పరిష్కరించుకుంటామని షర్మిల వెల్లడించారు. మీడియా సహా, జగన్ అప్పుడు నిర్వహించిన, ఇప్పుడున్న వ్యాపారాల్లో మీకు భాగం ఉంటుందనే భావిస్తున్నారా? అనగా, ఉంటుందనే భావిస్తున్నానని వివరించారు. ఓ మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని, తాను ఒంటరినని భావించడం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి ఎన్నో ఏళ్లు కష్టపడి ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకున్నారని, ఆయన కూతురిగా ప్రజల్లో తనకు విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి వస్తాను అనగానే భర్త అనిల్ కుమార్ ప్రోత్సహించాడని వెల్లడించారు. ఆయన వృత్తిరీత్యా సువార్త ప్రచారకుడని తెలిపారు. తామిద్దరం సికింద్రాబాద్ వద్ద ఓ ధాబాలో కలిశామని, మిత్రులతో కలిసి వెళ్లినప్పుడు పరిచయం ఏర్పడిందని వివరించారు. అప్పుడు తాను చదువుకుంటున్నానని, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పలేనని అన్నారు.

తనకు మొదటగా అనిలే ప్రపోజ్ చేశాడని వెల్లడించారు. తన ఇంట్లో ఈ ప్రేమకు ఒప్పుకోలేదని, వాళ్లు బ్రాహ్మణులు... వాళ్ల పద్ధతులు వేరుగా ఉంటాయని అన్నారని, కానీ తాను మాత్రం పట్టుదలతో పోరాడానని వివరించారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా గడుపుతున్నానని షర్మిల వెల్లడించారు.

More Telugu News