YS Sharmila: ​రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉంది: షర్మిల

  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో షర్మిల వ్యాఖ్యలు
  • వైఎస్సార్ తెలంగాణ వ్యతిరేకి కాదని స్పష్టీకరణ
  • కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని వెల్లడి
Sharmila opines on Telangana politics

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల అనేక అంశాలను పంచుకున్నారు. పులివెందులలో ఒకటో తరగతి వరకు చదువుకున్నానని, ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ నగరాల్లో తన విద్యాభ్యాసం సాగిందని వెల్లడించారు. ఎంబీఏ (ఫైనాన్స్) చేశానని తెలిపారు. వ్యాపారం చేసి ఉంటే రాణించి ఉండేదాన్నని షర్మిల అభిప్రాయపడ్డారు.

ఓ దశ వరకు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని, సరిగ్గా చెప్పాలంటే రాజకీయాలంటే అయిష్టం ఉండేదని వివరించారు. తన తండ్రి వైఎస్సార్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండేవారని, ఆయన రాజకీయాల్లో లేకపోతే తమతోనే ఎక్కువ సమయం కేటాయించేవారు కదా అన్న అభిప్రాయం అప్పట్లో ఉండేదని అన్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చిందని, ఓ బలమైన ఆశయంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

కరోనా సంక్షోభ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు కూడా తనలో రాజకీయ పార్టీ ఆలోచనలు కలిగించిందని వివరించారు. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార టీఆర్ఎస్ తో హోరాహోరీగా పోరాడుతున్నాయన్న ఆర్కే... ఇంకెక్కడ ఖాళీ ఉందని మీరు రాజకీయాల్లోకి వచ్చారని ప్రశ్నించారు. అందుకు షర్మిల బదులిస్తూ... తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది కాబట్టే వచ్చామని వెల్లడించారు.

టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలను అందించే పార్టీగా కాంగ్రెస్ ఉందని, ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి ఆ పార్టీకి అధ్యక్షుడని షర్మిల వెల్లడించారు. రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని, ఆయన ఇంకేం గట్టిగా మాట్లాడగలడని అన్నారు. తన తండ్రి వైఎస్సార్ ను తెలంగాణ వ్యతిరేకిగా సీఎం కేసీఆర్ ప్రచారం చేశారని, వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే తెలంగాణ కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి వైఎస్సార్ అని షర్మిల ఉద్ఘాటించారు.

ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 వంటి పథకాలను నాడు తెలంగాణ ప్రజలు కూడా అనుభవించారని, తాము కూడా అదే అజెండాతో వస్తున్నామని, కచ్చితంగా తమ పార్టీ విజయవంతం అవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుంటారని, ఎవరితోనూ పొత్తులు అవసరంలేదని షర్మిల ఉద్ఘాటించారు.

More Telugu News