USA: వలసదారులను కొరడాలతో తరిమిన అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు.. సర్వత్రా ఆగ్రహం.. ఫొటోలివిగో

  • అమెరికాలోకి ఎంటరైన హైతీ ప్రజలు
  • రివర్ గ్రాండేను దాటి ప్రవేశం
  • గుర్రాలపై కాపు కాస్తున్న అధికారులు
  • వలసదారులను పరుగెత్తించి తరిమిన వైనం
  • వీటిని ఆపాలంటూ బైడెన్ కు సొంత పార్టీ నేతల విన్నపం
US Immigration Officers Thrashed Haiti Migrants With Reins

వారంతా హైతీ దేశస్థులు.. పొట్ట చేతబట్టుకుని, బతుకు జీవుడా అనుకుంటూ అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మెక్సికో సరిహద్దుల నుంచి రియో గ్రాండే నది దాటి టెక్సాస్ లోని డెల్ రియోలోకి ఎంటరయ్యారు. అయితే, అప్పటికే అక్కడ గుర్రాలపై కాపలా కాస్తున్న అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వారిని తరిమి తరిమికొట్టారు. కనికరమన్నదే లేకుండా కొరడాలతో కొడుతూ నదిలోకి గెంటివేశారు.


ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోండి అంటూ కనీస జాలి లేకుండా తరిమారు. దీంతో వలసదారులు ప్రాణాలు అరచేతపెట్టుకుని పరుగులు తీశారు. వేడుకున్నా అమెరికా అధికారుల మనసులు మాత్రం కరగలేదు. గత సోమవారం ఏఎఫ్ పీకి చెందిన పాల్ రాట్యే అనే ఫొటోగ్రాఫర్ ఆ ఫొటోలను క్లిక్ మనిపించాడు. వాటిని అక్కడి అన్ని వార్తా పత్రికలు, సంస్థలు కవర్ చేశాయి. అధికారుల తీరుపై ప్రజలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.


ఇటు రాజకీయ నాయకుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఆ ఫొటోలపై స్పందించారు. ఈ ఘటన చాలా దారుణమన్నారు. అయితే, అక్కడి పరిస్థితులేంటో.. ఏ సందర్భంలో ఆ ఘటన జరిగిందో తెలియకుండా మాట్లాడడం మంచిది కాదన్నారు. బైడెన్ సొంత పార్టీ డెమొక్రటిక్ నేతలే ఘటనను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని బైడెన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో హైతీ నుంచి వేలాదిగా ప్రజలు అమెరికాలోకి అక్రమంగా వలస వస్తున్నారని, వారిని అడ్డుకోవడం కష్టమైపోతోందని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన వారిని విమానాల్లో తిరిగి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News