Deepak Hooda: ఐపీఎల్ లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం... ఒక్క ఫొటోతో అనుమానాలకు తావిచ్చిన దీపక్ హుడా

  • ఐపీఎల్ లో పంజాబ్ కు ఆడుతున్న దీపక్ హుడా
  • రాజస్థాన్ తో మ్యాచ్ కు ముందు ఫొటో పంచుకున్న హుడా
  • బుకీలకు సందేశం పంపాడంటూ అనుమానాలు
  • ఆ మ్యాచ్ లో డకౌట్ అయిన హుడా
Deepak Hooda pre match photo raised doubts on match fixing

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. పంజాబ్ కింగ్స్ ఆటగాడు దీపక్ హుడా మ్యాచ్ కు గంట ముందు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో అనుమానాలకు తావిస్తోంది. అధికారిక జెర్సీ ధరించి ఉన్న దీపక్ హుడా తన ఫొటోను పంచుకున్నాడు. తద్వారా తాను జట్టులో ఉన్నానన్న సంకేతాలను పంపాడు. ఇది బుకీలను ఉద్దేశించి చేసిన పోస్టు అని ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అనుమానాలకు మరింత బలం చేకూరేలా.... రాజస్థాన్ తో మ్యాచ్ లో పంజాబ్ జట్టు చివరి ఓవర్లో   ఓటమిపాలైంది. అప్పటికి చేతిలో 8 వికెట్లున్నాయి. 6 బంతుల్లో 4 పరుగులు చేస్తే గెలుస్తారన్న నేపథ్యంలో, పంజాబ్ జట్టు అనూహ్యరీతిలో ఒక్క పరుగు చేసి రెండు వికెట్లు చేజార్చుకుని విభ్రాంతికర రీతిలో ఓడింది. ఆ ఓవర్లో అవుటైన ఇద్దరిలో ఒకరు దీపక్ హుడా కావడం గమనార్హం. ఈ పోరులో దీపక్ హుడా డకౌట్ అయ్యాడు.

చివరి ఓవర్లో 20 పరుగులు కొట్టాల్సి వచ్చినా ఈ రోజుల్లో ప్రత్యర్థి జట్లు వెనుకంజ వేయడంలేదు. అది కూడా టీ20 క్రికెట్లో ఈ తరహా ఓటమి చాలా అరుదైన విషయం. ఈ నేపథ్యంలో హేమాహేమీలతో కూడిన పంజాబ్ కింగ్స్ జట్టు 6 బంతుల్లో 4 పరుగులు చేయలేకపోవడం మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ తేనెతుట్టెను కదిలించింది. దీనిపై బీసీసీఐ తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. దీపక్ హుడా వ్యవహారంపై షబ్బీర్ హుస్సేన్ నేతృత్వంలో బోర్డు యాంటీ కరప్షన్ బ్యూరో యూనిట్ (ఏసీయూ) విచారణకు ఉపక్రమించింది.

More Telugu News