Telangana: నీళ్ల సమస్యపై ప్రశ్నించినందుకు ఎగిరితన్నిన సర్పంచ్​.. గ్రామస్థుడి తలకు కుట్లు

  • పడేసి రాయితో కొట్టాడని బాధితుడి ఆరోపణ
  • ఆ వ్యక్తే తాగి వచ్చి తిట్టాడని సర్పంచ్ ప్రత్యారోపణ
  • బూతులు తిట్టిన వీడియో కూడా ఉందని వెల్లడి
  • ఎన్నో మాటలని గల్లా పట్టి కొట్టారన్న సర్పంచ్
  • ఓపిక నశించే కొట్టానని వివరణ
Sarpanch Allegedly Kicks Villager For Questioning About Water Problem

నీళ్ల సమస్యను ఎప్పుడు తీరుస్తారంటూ ప్రశ్నించినందుకు ఓ గ్రామస్థుడిపై సర్పంచ్ దాడి చేశారు. ఆ వ్యక్తిని ఎగిరెగిరి తన్నారు. అంతటితో ఆగకుండా రాయితో అతడిని చితకబాదారు. దీంతో ఆ వ్యక్తి తలకు తీవ్రగాయమైంది. కన్ను వాచిపోయింది. తలకు నాలుగు కుట్లు పడ్డాయి. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్ గ్రామంలో జరిగింది.

బాధితుడు శ్రీనివాస్ ను సర్పంచ్ జైపాల్ రెడ్డి తన్నుతున్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే, గ్రామంలో కొన్ని రోజులుగా నీళ్ల సమస్య ఉందని, కిరాణా షాపుకు వెళ్లగా అక్కడ సర్పంచ్ తో పాటు మరికొందరు నీళ్ల గురించి మాట్లాడుకుంటుండగా తానూ సమస్యపై ప్రశ్నించానని బాధితుడు శ్రీనివాస్ చెప్పారు. అయితే, నువ్వేందిరా అడిగేదంటూ సర్పంచ్ తన్నాడని, కిందపడేసి రాయితో బాదాడని తెలిపారు. ఇష్టమొచ్చినట్టు తనపై దాడి చేశారని ఆరోపించారు.

కాగా, దీనిపై సర్పంచ్ జైపాల్ రెడ్డి కూడా తన వివరణ ఇచ్చారు. తాను ఊరికే శ్రీనివాస్ ను కొట్టలేదని, తనను బూతులు తిట్టాడని, అమ్మను కలిపి తిట్టాడని ఓపిక నశించే కొట్టానని జైపాల్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందన్నారు. అంతేగాకుండా వేరే వాళ్లతో తన గల్లా కూడా పట్టించి దాడి చేయించబోయాడన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి తనపై కుట్ర చేశారని ఆరోపించారు. శ్రీనివాస్ తో తనకెలాంటి గొడవలు లేవని, అతడు మంచివాడని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల చెప్పుడు మాటలు విని తనపై దాడికి ప్రయత్నించాడని, తాగి వచ్చి గొడవ పెట్టుకున్నాడని ఆయన తెలిపారు. పోలీసుల చెకింగ్ లో కూడా ఆ విషయం తేలిందని చెప్పారు.  

More Telugu News