IPL 2021: తదుపరి ఐపీఎల్‌లో ఈ భారత ఆటగాళ్లు కనబడరా?

  • ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2021 సెకండ్ సెషన్
  • తర్వాతి సీజన్‌‌లో కొంత మంది సీనియర్లు ఆడబోరని వార్తలు
  • జాబితాలో భజ్జీ, సాహా, కేదార్ జాదవ్, అమిత్ మిశ్రా?
These senior players may not play another IPL

ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టోర్నీ ఐపీఎల్. ప్రస్తుతం ఐపీఎల్-2021 రెండో దశ మ్యాచులు జరుగుతున్నాయి. ఈ లీగ్ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో కొందరు సీనియర్ ఆటగాళ్లు కనిపించబోరని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ జాబితాలో సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా కూడా ఉండటం గమనార్హం. ఐపీఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ మిశ్రా అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లెగ్ స్పిన్నర్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా? ఇలాగే మరికొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌కు వీడ్కోలు పలకబోతున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్ల పేర్లు పరిశీలిస్తే..

1. హర్భజన్ సింగ్
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నాడు. ఈ వెటరన్‌ ముంబై ఇండియన్స్‌తో తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. పది సీజన్లు ఈ జట్టుతో ప్రయాణించిన తర్వాత అతన్ని ముంబై జట్టు వేలంలో పెట్టింది. ఆ సమయంలో అంటే 2018లో కనీస ధర చెల్లించిన చెన్నై జట్టు భజ్జీని సొంతం చేసుకుంది. రెండు సీజన్‌ల తర్వాత చెన్నై కూడా భజ్జీని వేలంలో పెట్టింది. అతన్ని తాజా సీజన్‌లో కోల్‌కతా జట్టు కొనుగోలు చేసింది. ఈ ఏడాది జులై నెలలో హర్భజన్ 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2021 రెండో దశ పూర్తయితే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

2. అమిత్ మిశ్రా
భారత్‌లో లెగ్ స్పిన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అమిత్ మిశ్రా. భారత జట్టులో పెద్దగా అవకాశాలు దక్కకపోయినా ఐపీఎల్‌లో మాత్రం తనదైన ముద్రవేశాడీ వెటరన్ స్పిన్నర్. ఢిల్లీ జట్టుతో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న మిశ్రా.. తన ఐపీఎల్ కెరీర్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన రికార్డు సాధించాడు. కొంతకాలం క్రితమే మిశ్రా వయసు 39 ఏళ్లు నిండాయి. ఈ క్రమంలో అతనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

3. వృద్ధిమాన్ సాహా
ఈ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ కూడా వచ్చే నెలలో 37 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో కెరీర్ ప్రారంభించిన సాహా ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021 రెండో దశలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూరమయ్యాడు. దీంతో సాహానే జట్టు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే సాహా కూడా ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పనున్నాడని వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.

4. కేదార్ జాదవ్
ఐపీఎల్‌లో హార్డ్ హిట్టర్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు కేదార్ జాదవ్. కొన్ని మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి మన్ననలూ పొందిన ఈ క్రికెటర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. 2018లో భారీ ధర చెల్లించి మరీ అతన్ని చెన్నై జట్టు సొంతం చేసుకుంది. అయితే మళ్లీ 2021లో అతన్ని వేలంలో పెట్టింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ జట్టు అతన్ని దక్కించుకుంది. ప్రస్తుతం జాదవ్ వయసు 36. ఫామ్‌లో కూడా లేడు. దీంతో ప్రస్తుతం జరుగుతున్నదే ఇతని కెరీర్‌లో చివరి ఐపీఎల్ కావొచ్చని తెలుస్తోంది.

5. రాబిన్ ఊతప్ప
కోల్‌కతా జట్టులో ఓపెనర్‌గా అవతారం ఎత్తి అద్భుతంగా రాణించిన రాబిన్ ఊతప్ప ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో ఉన్న అతనికి ఈ ఐపీఎల్ సీజన్ తొలి దశలో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. ఈ క్రమంలో అతను కూడా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News