Mumbai Indians: ముంబై ఓటమికి కెప్టెన్ తప్పిదమే కారణం: కెవిన్ పీటర్సన్

  • అదిరిపోయే ఆరంభం ఇచ్చిన ముంబై బౌలర్లు
  • సద్వినియోగం చేసుకోలేకపోయిన కెప్టెన్ పొలార్డ్
  • 20 పరుగుల తేడాతో ఓడిన ముంబై జట్టు
  • అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్
Mumbai Indians Captain could not use the opening from bowlers says Kevin Pieterson

యువ బ్యాట్స్‌‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 88 నాటౌట్: 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఐపీఎల్ రెండో సెషన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైను 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమికి కెప్టెన్ కీరన్ పొలార్డ్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే కారణమని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.

‘‘ముంబైకి బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ లేకపోయినా ఒత్తిడిని జయించి శుభారంభం అందుకుందా జట్టు. తొలి పవర్‌ప్లే పూర్తయ్యేసరికి చెన్నై జట్టు కీలకమైన వికెట్లన్నీ కోల్పోయింది. అంబటి రాయుడు కూడా రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. ఆ అవకాశాన్ని ముంబై ఉపయోగించుకోవాల్సింది. కానీ ఇక్కడే కెప్టెన్ పొలార్డ్ తప్పు చేశాడు. ఆ సమయంలోనే జస్ప్రీత్ బుమ్రాతో 2-3 ఓవర్లు వేయించి ఉండాల్సింది. అప్పుడు చెన్నై జట్టు 70-80 పరుగులకే ఆలౌట్ అయ్యుండేది’’ అని కెవిన్ చెప్పాడు.

ఇదంతా తాను ఊరికే చెప్పడం లేదని, ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు స్టార్ బౌలర్లను బరిలోకి దించడం సత్ఫలితాలనే ఇస్తుందని అతను అన్నాడు. కాగా, మ్యాచ్‌లో పవర్ ప్లే ముగియగానే బుమ్రా చేత పొలార్డ్ ఒక ఓవర్ వేయించాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో మళ్లీ బుమ్రాకు అవకాశం వచ్చింది. అయితే అప్పటికే రుతురాజ్ క్రీజులో కుదురుకొని తమ జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా తీసుకెళ్లాడు. దీంతో బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

More Telugu News