YS Sharmila: వైఎస్ షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. దీక్షా స్థలం నుంచి తరలింపు

  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల
  • అనంతరం అక్కడే దీక్ష
  • అర్ధరాత్రి రంగంలోకి పోలీసులు
Police moved ys sharmila from deeksha place

నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిన్న బాధిత కుటుంబాన్ని సందర్శించిన షర్మిల అనంతరం అక్కడే దీక్షకు కూర్చున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. అయితే, గత అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షా స్థలికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్టీపీ శ్రేణులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం షర్మిల దీక్షను భగ్నం చేసి అక్కడి నుంచి తరలించారు.

అంతకుముందు షర్మిల మాట్లాడుతూ.. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ నోరు విప్పి బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. నిందితుడిని ఇంకా పట్టుకోలేకపోవడం పోలీసుల అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, మహిళలపై లాఠీచార్జ్ చేసి చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లారని ఆరోపించారు.

30 వేల జనాభా ఉన్న కాలనీలో ప్రజలకు రక్షణ కరవైందని నిప్పులు చెరిగారు. పందులు పిల్లల్ని పీక్కు తింటున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News