Guinea: ఇంకా సైన్యం నిర్బంధంలోనే గినియా అధ్యక్షుడు.. ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని రద్దు చేసిన సైన్యం!

  • ఆదివారం సైన్యం తిరుగుబాటు
  • అధికారం ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైతే దేశానికి నష్టమనే తిరుగుబాటు చేశామన్న కల్నల్
  • సైన్యం తిరుగుబాటును హర్షిస్తూ జనం సంబరాలు
Guinea president conde still in military Detention

పశ్చిమ ఆఫ్రికా దేశం గినియా అధ్యక్షుడు ఆల్ఫా కోండ్ (83) ఇంకా సైన్యం అదుపులోనే ఉన్నారు. ఆదివారం అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం తాజాగా ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రాంతీయ గవర్నర్లను తొలగించి వారి స్థానంలో సైన్యాధికారులను నియమించింది.

ఈ సందర్భంగా కల్నల్ మమాది దుంబయ జాతీయ టెలివిజన్‌లో మాట్లాడుతూ.. అధికారం ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైతే దేశానికి నష్టమన్నారు. అందుకనే ప్రజల తరపున తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని కూడా రద్దు చేశామన్న ఆయన ప్రత్యర్థులపై మాత్రం ప్రతీకార చర్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చారు. అయితే నిర్బంధంలో ఉన్న అధ్యక్షుడిని ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

 కాగా, అధ్యక్షుడు కోండ్ గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన పదవి నుంచి వైదొలగాలని ఇటీవల డిమాండ్ చేశాయి. 2010 నుంచి గినియా అధ్యక్షుడిగా ఉన్న కోండ్ మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఇటీవల రాజ్యాంగాన్ని సవరించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సైన్యం తిరుగుబాటును ప్రజలు హర్షిస్తూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.

More Telugu News