Ida Hurricane: న్యూయార్క్ లో మరణమృదంగం మోగించిన 'ఇడా' తుపాను

  • భారీ వర్షాల కారణంగా న్యూయార్క్ లో ఆకస్మిక వరదలు
  • రాత్రికి రాత్రే కనీసం 44 మంది మృతి
  • చారిత్రక వాతావరణ సంఘటనగా అభివర్ణిస్తున్న నిపుణులు
44 Dead As Flash Floods Hit New York

అమెరికాను వరుస హరికేన్లు వణికిస్తున్నాయి. తాజాగా ఇడా తుపాను పంజా విసురుతోంది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలు న్యూయార్క్ లో విషాదాన్ని నింపాయి. ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా రాత్రికి రాత్రే కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలను 'చారిత్రాత్మక వాతావరణ సంఘటన'గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

వరదల వల్ల న్యూయార్క్ వీధులు నదుల్లా మారాయి. సబ్ వే లోని ట్రాకులన్నీ నీట మునగడంతో సబ్ వే సేవలను ఆపేశారు. వరద బీభత్సం నేపథ్యంలో న్యూయార్క్ లో ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు. వరదల గురించి 50 ఏళ్ల మోటోడిజ మిహజ్లోవ్ అనే వ్యక్తి మాట్లాడుతూ... తన జీవితంలో ఇలాంటి భారీ వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.  మన్ హట్టన్ లో ఆయన రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. తన రెస్టారెంట్ లో మూడు ఇంచుల మేర నీరు నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిని తాను నమ్మలేకపోతున్నానని... ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్ కలుగుతోందని చెప్పారు.

మరోవైపు జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో వందలాది విమానాలు నిలిచిపోయాయి. టెర్మినల్స్ ను వరద నీరు ముంచెత్తింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ... ఈ విపత్కర పరిస్థితుల్లో అందరం సమష్టిగా ఉందామని పిలుపునిచ్చారు. న్యూయార్క్ కు సాయం చేసేందుకు దేశమంతా సిద్ధంగా ఉందని అన్నారు.

More Telugu News