Mysuru: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురి అరెస్ట్.. ఇంకా షాక్ లోనే ఉన్న బాధితురాలు

  • మంగళవారం మైసూరులో జరిగిన గ్యాంగ్ రేప్
  • మైసూరు యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్న బాధితురాలు
  • ఆరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపిన డీజీపీ
5 Arrested In Mysuru Gang Rape Case

కర్ణాటకలోని మైసూరు విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఆరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. నిందితులంతా తమిళనాడు నుంచి వచ్చిన లేబర్ అని తెలిపారు. వీరిలో ఒకరు 17 ఏళ్ల మైనర్ గా భావిస్తున్నామని చెప్పారు. దీన్ని నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. మంగళవారం ఈ దారుణ ఘటన జరిగినా... ఇంత వరకు అరెస్టులు జరగలేదంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ... ఈ కేసు చాలా సున్నితమైన కేసు అని అన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని మైసూరు యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతోంది. మంగళవారం సాయంత్రం మైసూరు శివార్లలో ఉన్న టూరిస్ట్ స్పాట్ చాముండి హిల్స్ కు తన స్నేహితుడితో కలిసి వెళ్లింది. ఆ సమయంలో నిందితులంతా ఆ ప్రాంతంలో మందు తాగుతూ ఉన్నారు. అడవిలోకి వెళ్తున్న వారిద్దరినీ అనుసరించారు.

అనంతరం వారిని ఆపి, డబ్బు ఇవ్వమని డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో ఆమె స్నేహితుడిని వారు చితకబాదారు. నిందితులలో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితురాలు ఇంకా షాక్ లోనే ఉండటంతో ఆమె స్టేట్మెంట్ ను నమోదు చేయలేదని డీజీపీ తెలిపారు.

More Telugu News