America: జో బైడెన్ ప్రతీకారేచ్ఛ.. కాబూల్ పేలుళ్ల కారకులను వెంటాడి మరీ మట్టుబెడతామని ప్రతిన

  • నిన్నటి దాడిలో 12 మంది అమెరికా సైనికులు సహా 72 మంది దుర్మరణం
  • ఇతరుల కోసం అమెరికా తన ప్రాణాలను పణంగా పెడుతోందన్న బైడెన్
  • మరణించిన సైనికులను హీరోలుగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు
Joe Biden to Kabul attackers We will hunt you down and make you pay

కాబూల్ విమానాశ్రయం వెలుపల జరిగిన వరుస ఉగ్రపేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించిన ఆయన.. ఇంతకింత ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్ల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి మరీ మట్టుబెడతామన్నారు. ఐసిస్ నేతలను హతమార్చాలని బలగాలను ఆదేశించారు. తమ మిషన్ కొనసాగుతుందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులను తరలిస్తామని బైడెన్ స్పష్టం చేశారు.

కాబూల్ విమానాశ్రయం బయట జరిగిన ఉగ్రదాడిలో తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్టు ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని బైడెన్ పేర్కొన్నారు. తాము ప్రమాదకర మిషన్‌ను కొనసాగిస్తున్నామని, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా తన ప్రాణాలను పణంగా పెడుతోందన్నారు. ఈ నెల 31న గడువు తేదీ నాటికి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని బైడెన్ పునరుద్ఘాటించారు. కాబూల్ ఆత్మాహుతి దాడి ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 12 మంది తమ సైనికులు ఉన్నట్టు తెలిపారు.

More Telugu News