India: దేశంలో 21 శాతం ప్రాంతాల్లో కరవు పరిస్థితులు: ఐఐటీ నివేదిక

  • గత ఏడాదితో పోలిస్తే 62 శాతం ఎక్కువ
  • రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రం
  • గుజరాత్ లో 48 శాతం లోటు వర్షపాతం
DEWS Warns India Witnessing Drought Situations

దేశంలో కరవు ముసురుకొస్తోందా? ఇప్పటికే కమ్మేసిందా? అంటే అవుననే అంటోంది ముందుగానే కరవు పరిస్థితులను అంచనా వేసే ఐఐటీ గాంధీనగర్ డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (డీఈడబ్ల్యూఎస్– డ్యూస్) నివేదిక. దేశంలోని 21.06 శాతం భూముల్లో ఇప్పటికే కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని, అక్కడ భూములన్నీ పొడిబారిపోయాయని డ్యూస్ తన డేటాలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 62 శాతం ఎక్కువైందని పేర్కొంది.

దేశంలోని 1.63 శాతం ప్రాంతంలో అత్యంత తీవ్రమైన కరవు, 1.73 శాతం భూముల్లో తీవ్రమైన కరవు నెలకొందని పేర్కొంది. 2.17 శాతం మేర తీవ్రమైన పరిస్థితులున్నాయని చెప్పింది. 8.15 శాతం భూముల్లో మధ్యస్థ స్థాయి పొడి పరిస్థితులున్నాయని తెలిపింది. ఇక, 7.38 శాతం భూముల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది.

ఉత్తర, మధ్య, తూర్పు భారత రాష్ట్రాల్లో కరవు పరిస్థితులున్నాయని డ్యూస్ డేటా పేర్కొంది. రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత తీవ్రమైన కరవుందని వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదముందని ఐఐటీ గాంధీనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా తెలిపారు.

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకారం ఈ రాష్ట్రాల్లో గుజరాత్ లో అత్యధికంగా 48 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. ఒడిశాలో 29 శాతం, నాగాలాండ్, పంజాబ్ లలో 22 శాతం, ఛత్తీస్ గఢ్ లో 11 శాతం, రాజస్థాన్ లో 4 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైందన్నారు.

More Telugu News