Obulapuram: ఓబుళాపురం లీజు నిబంధనల్లో మార్పు.. కడప స్టీల్‌ప్లాంట్‌కు ఖనిజంలో వాటా!

  • ఓబుళాపురం సమీపంలో ఏపీఎండీసీకి 25 హెక్టార్ల ఇనుప ఖనిజం కేటాయింపు
  • మైన్ డెవలపర్, ఆపరేటర్ కోసం ఐదు సంస్థల టెండర్లు
  • తవ్వితీసిన ఖనిజంలో 75 శాతం కడప స్టీల్ ప్లాంట్‌కు ఇవ్వాలని నిబంధన
Obulapuram lease terms changed Kadapa steel plant to get share in the Iron ore

ఓబుళాపురం మైనింగ్ లీజు వ్యవహారంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మార్పులు చేసింది. లీజును దక్కించుకున్న సంస్థ తవ్వితీసిన ఖనిజాన్ని కడపలో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమకు ఇవ్వాలంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం సమీపంలోని హెచ్.సిద్ధాపురంలో ఏపీఎండీసీకి గతంలో 25 హెక్టార్ల ఇనుప ఖనిజాన్ని లీజుకు కేటాయించారు. ఇందులో 40 లక్షల టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఖనిజాన్ని తవ్వి తీసేందుకు మైన్ డెవలపర్, ఆపరేటర్ కోసం గత నెలలో టెండర్లు ఆహ్వానించారు. దక్కించుకునేందుకు ఐదు సంస్థలు టెండర్లు వేశాయి.

తాజాగా, ఈ లీజుకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కొన్ని మార్పులు చేసి నిబంధనలు తీసుకొచ్చింది. ఖనిజాన్ని తవ్వితీసేందుకు లీజు దక్కించుకున్న సంస్థ వెలికి తీసిన ఖనిజంలో 75 శాతాన్ని తొలి ప్రాధాన్యంగా కడపలో ఏర్పాటు చేసే ఉక్కు పరిశ్రమకు ఇవ్వాలన్న నిబంధన జోడించింది. మిగిలిన ఖనిజాన్ని లీజు దక్కించుకున్న సంస్థ ఈ-వేలం ద్వారా విక్రయించుకోవచ్చని పేర్కొంది. అంతేకాదు, సరఫరా చేసిన ఖనిజం మొత్తాన్ని పరిశ్రమ వినియోగించుకోలేకపోతే దానిని కూడా విక్రయించుకోవచ్చని తెలిపింది.

More Telugu News