Taliban: మాటలను బట్టి కాకుండా.. చేతలను బట్టి తాలిబన్లపై అంచనాకు రావాలి: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

  • ఆఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష పెట్టిన తాలిబన్లు
  • కొత్త ప్రభుత్వం పాతదానిలా ఉండబోదంటూ ప్రకటన
  • తాము సమర్థవంతంగా స్పందించామన్న బోరిస్
  • రెండువేల మందికి పైగా ఆఫ్ఘన్లను విదేశాలకు తరలించామన్న బ్రిటన్ పీఎం  
The Taliban should be judged not by words but by deeds UK Prime Minister Boris Johnson

ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. తాము గతంలోలా కాకుండా కొత్త విధానంలో పరిపాలన సాగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళల హక్కులను కూడా గౌరవిస్తామని, ఏ దేశంతోనూ తాము శత్రుత్వం కోరుకోవడం లేదని తాలిబన్లు ప్రకటించారు.

ఈ క్రమంలో ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లను వారి మాటలను బట్టి కాకుండా, వారి చేతలను బట్టి అంచనా వేయాలని ఆయన అన్నారు. దేశంలోని ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలోనే బోరిస్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ వశమైన ఆఫ్ఘనిస్థాన్ నుంచి రెండువేల మందికి పైగా ఆఫ్ఘన్లను విదేశాలకు తరలించేందుకు బ్రిటన్ సహకరించిందని ఆయన చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తలెత్తిన క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా స్పందించిందని జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 306 మంది బ్రిటన్‌ పౌరుల్ని, 2 వేలమందికిపైగా ఆఫ్ఘన్ పౌరుల్ని తమ ప్రభుత్వం సురక్షితంగా విదేశాలకు తరలించిందని జాన్సన్ తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకునే వారికోసం బ్రిటన్ ప్రభుత్వం పునరావాస పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 5 వేలమందికి పునరావాసం కల్పించాలని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫ్ఘన్ ప్రజల డిమాండ్ల మేరకు ఈ సంఖ్యను 20 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

More Telugu News