Haryana: పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష రాసిన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా

  • సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్లో పరీక్ష
  • జేబీటీ రిక్రూట్‌మెంట్ స్కాంలో పదేళ్ల జైలు
  • జైలు జీవితాన్ని చదువుకు ఉపయోగించుకుంటున్న నేత
  • చేతికి గాయం కావడంతో సహాయకుడిని ఇచ్చిన అధికారులు
  • గతంలో పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష మిస్సయిన ఓం ప్రకాశ్ 
Former Haryana CM Om Prakash Chautala who wrote the Class X English exam

హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా తన పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో బుధవారం ఆయన ఈ పరీక్ష రాశారు.

86 ఏళ్ల చౌతాలా గతంలో జేబీటీ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. తన జైలు జీవితాన్ని ఆయన మెట్రిక్యులేషన్ చదువు కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఆ కోర్సులో ఇంగ్లిష్ పరీక్ష మిస్సయ్యారు. దాన్నే ఇప్పుడు రాశారు. మాజీ సీఎం చేతికి గాయమైందని, కాబట్టి ఆయనకు పరీక్ష రాయడం కోసం సహాయకుడిని అనుమతించామని బీఎస్ఈహెచ్ సెక్రటరీ హితేందర్ కుమార్ తెలిపారు.

ఆమధ్య భివానీ ఎడ్యుకేషనల్ బోర్డులో ఓపెన్ ఎగ్జామినేషన్ సిస్టంలో 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఈ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే చౌతాలా మెట్రిక్యులేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయన ఫలితాన్ని బోర్డు విడుదల చేయలేదు. దీంతో దానిని పూర్తి చేయడం కోసం ఆయన ఇప్పుడు ఇంగ్లిష్ పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రం వద్ద మీడియా ప్రశ్నలకు చౌతాలా ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు.

More Telugu News