Taliban: ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబన్లకు ఇవ్వాలి: బ్రిటన్ ఆర్మీ చీఫ్

  • మారిన తాలిబన్లను చూసే అవకాశం ప్రపంచానికి దక్కుతుందన్న నిక్ కార్టర్
  • 1990ల నాటి తాలిబన్ల కంటే ఇప్పటి తాలిబన్లు భిన్నమైన వారు అయ్యుండొచ్చు
  • తాలిబన్లు అందరూ ఒకే భావజాలంతో ఉండరు
Have to give a chance to Talibans to form government says Britain Army Chief

ఆఫ్ఘనిస్థాన్ ను మరోసారి వశం చేసుకున్న తాలిబన్లు... గతంలో మాదిరి కాకుండా, ఈసారి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాలన కొనసాగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాలిబన్ల ప్రకటనను ఎక్కువ మంది నమ్మడం లేదు.

మరోవైపు బ్రిటన్ ఆర్మీ చీఫ్ సర్ నిక్ కార్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబన్లకు ఇవ్వాలని అన్నారు. అందరం ఓర్పుతో ఉండాలని, ఆందోళనను నియంత్రించుకోవాలని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబన్లకు ఇస్తే... బాధ్యతాయుతంగా మారిన తాలిబన్లను చూసే అవకాశం ప్రపంచానికి దక్కుతుందని అన్నారు.

మనకు తెలిసిన 1990ల నాటి తాలిబన్ల కంటే ఇప్పటి తాలిబన్లు భిన్నమైనవారు అయ్యుండొచ్చని చెప్పారు. తాలిబన్లు అందరూ ఒకే భావజాలంతో ఉండరని... వారిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయని అన్నారు. గ్రామీణ ఆఫ్ఘనిస్థాన్ లోని వివిధ తెగల సమూహమే తాలిబన్లు అని చెప్పారు. కాబూల్ లో తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... వారు మారారనే నమ్మకం కలుగుతోందని అన్నారు.
 
మరోవైపు బ్రిటన్ మాజీ సైనికాధికారి హెర్బర్ట్ స్పందిస్తూ... తాలిబన్లను గుర్తించే విషయంలో తొందరపాటు వద్దని అన్నారు. తమ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు కావాలని తాలిబన్లు కోరుకుంటున్నారని చెప్పారు. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు.. సహజంగానే వినసొంపుగా మాట్లాడతారని అన్నారు. మనం ఆఫ్ఘనిస్థాన్ ను పూర్తిగా వదిలి పెట్టేంత వరకు వారు ఓపికగా ఉంటారని చెప్పారు. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం, జర్నలిస్టుల దృష్టి ఆఫ్ఘన్ పై లేనప్పుడు మళ్లీ రక్తపుటేరులు పారిస్తారని అన్నారు.

More Telugu News