Andhra Pradesh: ఇండియాటుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే.. బెస్ట్ సీఎంగా యోగి.. టాప్ టెన్ లో కనిపించని జగన్, కేసీఆర్!

  • జాతీయ స్థాయిలో బెస్ట్ సీఎంగా యూపీ సీఎం యోగి
  • రెండు, మూడు స్థానాలలో కేజ్రీవాల్, మమత 
  • స్వరాష్ట్రంలో తమిళనాడు సీఎం   స్టాలిన్‌కు 42 శాతం మంది ఆదరణ
India today mood of the nation survey ap cm jagan graph drastically decreased

‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జాతీయ స్థాయిలో బెస్ట్ సీఎంగా 19 శాతం ఓట్లతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దాస్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఆయన ఆదరణ 6 శాతం తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 14 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 11 శాతం ప్రజాదరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు.

ఇక గతేడాది నిర్వహించిన ఇదే సర్వేలో ‘బెస్ట్ సీఎం’గా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ ఈసారి పడిపోయింది. బోల్డన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆయనకు సరైన ఆదరణ లభించకపోవడం గమనార్హం. ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను స్వరాష్ట్ర ప్రజలు బెస్ట్ సీఎం అంటూ కీర్తించారు. ఆ రాష్ట్రంలో 42 శాతం మంది ఆయనకు ఓట్లేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. అలాగే స్వరాష్ట్రంలో ప్రజాదరణలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (38శాతం), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (35శాతం) రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

  ‘మోస్ట్ పాప్యులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్’ టాప్-10 జాబితాలో కూడా ఏపీ సీఎం జగన్ పేరు కనిపించలేదు.  టాప్-10 జాబితాను మాత్రమే వెల్లడించడంతో జగన్ స్థానం ఎంతన్నది తెలియరాలేదు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా టాప్ టెన్ జాబితాలో లేదు.

మరోవైపు, జాతీయ స్థాయిలోనూ జగన్‌కు ఆదరణ తగ్గినట్టు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది. గతేడాది ఇదే సర్వేలో జాతీయ స్థాయిలో జగన్ బెస్ట్ సీఎం అంటూ 11 శాతం మంది ఓట్లేయగా, ఈసారి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఆరు శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓట్లేశారు.  

  ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా  19 రాష్ట్రాల పరిధిలో 115 లోక్‌సభ నియోజకవర్గాలు, 230 అసెంబ్లీ స్థానాల్లో గత నెల 10-20 తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తంగా 14,599 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 29 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు.

More Telugu News