Anand Mahindra: ఆనంద్​ మహీంద్రాను ట్రోల్​ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఓ వీడియోకు ఆయన పెట్టిన కామెంటే.. ఇదిగో వీడియో

  • ఇటుకలను తలపై మోస్తున్న వ్యక్తి వీడియో పోస్ట్
  • యంత్రాలను వాడలేరా? అంటూ కామెంట్
  • అతడి ఉపాధి మాటేంటని ప్రశ్నించిన నెటిజన్లు
  • లక్షలాది మంది ఉపాధి పోతుందని కామెంట్లు
Anand Mahindra Posts A Video Gets Trolled By Netizens

ఎప్పుడూ మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తూ అందరిలోనూ స్ఫూర్తి నింపే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.. ఇప్పుడు తనకు తెలియకుండానే ఓ తప్పు మాట అనేసి విమర్శల పాలవుతున్నారు. తాజాగా కూడా ఆయన స్ఫూర్తిమంతమైన వీడియోనే పోస్ట్ చేశారు. ఓ కూలీ తన తలపై పదుల సంఖ్యలో ఇటుకలను బ్యాలెన్స్ చేసే వీడియోను పెట్టారు. అయితే, దానికి ఆయన పెట్టిన కామెంటే తలనొప్పులు తెచ్చిపెట్టింది.


‘‘ఎవరూ ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు. ఎవరితోనూ చేయించకూడదు. అయితే, ఇన్ని ఇటుకలను ఒకేసారి తన తలపై మోస్తూ.. బ్యాలెన్స్ చేస్తున్న అతడి కష్టాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇది ఎక్కడ జరిగిందో ఎవరికైనా తెలుసా? అతడి యజమానులు ‘యంత్రాలను (ఆటోమేషన్) వాడుకోలేరా?’ అతడి నైపుణ్యాలను గుర్తించరా?’’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు.. యంత్రాలతో కలిగే నష్టాలేంటో వివరించారు. ఆయన మీదున్న గౌరవంతో కొంచెం సాఫ్ట్ గానే ట్రోల్ చేశారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఒకవేళ దీన్నిగానీ ఆటోమేట్ చేస్తే.. ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు లేని ఈ వ్యక్తి ఉపాధి మాటేంటి? అతడి లాగానే ఇలా కూలీ పనులతో బతికే లక్షలాది మంది బతుకుల పరిస్థితేంటి?’’ అని ఓ యూజర్ ప్రశ్నించారు.

ఆటోమేషన్ వస్తే లక్షలాది మంది ఉపాధి గల్లంతవుతుందని, ఆటోమేషన్ సురక్షితమైనదైనా ఇలాంటి వారికి వేరే చోట ఎక్కడా ఉపాధి దొరకదని మరో యూజర్ కామెంట్ పెట్టారు. కన్వేయర్ బెల్టులు, హైడ్రాలిక్ లిఫ్టులు పెట్టి తీసుకెళ్లొచ్చు సార్.. వాటిని ఏర్పాటు చేస్తే మరి వీళ్ల తిండి తిప్పల సంగతేంటని మరో యూజర్ ప్రశ్నించారు. ఆటోమేషన్ గొప్ప అని మనం ఆలోచించడం.. చాలా చెడ్డ విషయమని మరో యూజర్ రాసుకొచ్చారు.

More Telugu News