Govt Schools: తెలంగాణలో ‘ప్రైవేటు’ను వీడి సర్కారు స్కూళ్లలో భారీగా చేరుతున్న విద్యార్థులు

  • ప్రభుత్వ పాఠశాలలవైపు చూస్తున్న విద్యార్థులు
  • కరోనా దెబ్బ, అధిక ఫీజులతో సర్కారు బడులవైపు చూపు
  • ఇప్పటికే లక్షదాటిన ప్రవేశాలు
students joings in govt schools and left private schools

అధిక ఫీజులు, అంతంత మాత్రం చదువులు, కరోనా దెబ్బ.. కారణం ఏదైనా ప్రైవేటు స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరం భారీగా పెరిగింది. 2021-22కు గాను ఇప్పటి వరకు 1,14,415 మంది విద్యార్థులు 1 నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సాధారణ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లలో వీరంతా ప్రవేశాలు పొందినట్టు విద్యాశాఖ పేర్కొంది.

2019-20 సంవత్సరంలో 68,813 మంది ప్రైవేటు విద్యా సంస్థల నుంచి వచ్చి ప్రభుత్వ విద్యా సంస్థలలో చేరితే, గత విద్యా సంవత్సరంలో లక్ష మంది వరకు మారి ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు సంస్థల్లో ఎంతమంది చేరారు? ఎంతమంది చదువుకు స్వస్తి చెప్పారన్న గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు.

ఈ ఏడాది ఇప్పటి వరకు ఒకటో తరగతిలో 1,25,034 మంది ప్రవేశాలు పొందారు. మరో రెండు నెలలపాటు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, గత విద్యా సంవత్సరంలో ఏకంగా 1.50 లక్షల మంది ఒకటో తరగతిలో చేరినట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఈసారి ఇంటర్ ఫస్టియర్‌లో లక్షమందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరారు.

More Telugu News