CBI: సింహం లాంటి వివేకాను మరో సింహమేదో చంపి ఉంటుంది.. మాలాంటి చిట్టెలుకలకు సాధ్యం కాదు: సునీల్ యాదవ్ సోదరుడు

  • వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు
  • రెండున్నర గంటలపాటు వైఎస్ అభిషేక్‌రెడ్డి విచారణ
  • బాత్రూమ్ నుంచి వివేకా మృతదేహాన్ని హాల్లోకి ఎవరు తెచ్చారని ప్రశ్న
  • బృందాలుగా విడిపోయి పలువురి అనుమానితుల ఇళ్లలో సోదాలు
  • సునీల్ బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా స్వాధీనం
  • సీబీఐ అధికారుల తీరుపై సునీల్ సోదరుడు అనుమానం
CBI Questions Dr Abhishek Reddy on YS Viveka Murder Case

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ అనుమానితులను వరుసగా విచారిస్తూ వివరాలు రాబడుతోంది. ఇందులో భాగంగా నిన్న పులివెందులలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీఎం జగన్ సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డిని దాదాపు రెండున్నర గంటలపాటు ప్రశ్నించారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాతి రోజు అభిషేక్‌రెడ్డి అక్కడే ఉన్నట్టు సమాచారం ఉండడంతో ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు.  బాత్రూములో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని హాల్లోకి ఎవరు తీసుకొచ్చారు? ఆయన తలకు కట్టు ఎవరు కట్టారు? ఆ సమయంలో ఉన్న వైద్యులెవరు? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న అయిన వైఎస్ ప్రకాశ్‌రెడ్డికి అభిషేక్‌రెడ్డి పెద్ద మనవడు.

మరోవైపు, నిన్న సీబీఐ అధికారులు బృందాలుగా విడిపోయి పులివెందుల, ప్రొద్దుటూరు, తేలూరుతుమ్మలపల్లె, సుంకేసుల గ్రామాల్లోని అనుమానితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. కర్ణాటక నుంచి వచ్చిన అధికారుల బృందం కూడా ఇందులో పాల్గొంది. భాకరాపురంలోని సునీల్‌ యాదవ్ ఇంట్లో ఇద్దరు సీబీఐ అధికారులు దాదాపు మూడు గంటలపాటు తనిఖీలు  నిర్వహించారు.

ఈ సందర్భంగా సునీల్ బ్యాంకు పాస్ పుస్తకం,  పాత చొక్కా స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు  ఐదు కత్తులు, బ్యాంకు పాస్‌ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు పులివెందుల భయ్యమ్మతోట, తొండూరు మండలం తేలూరుతుమ్మలపల్లె గ్రామాల్లోని ఎర్రగంగిరెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేశారు.

 సింహాద్రిపురం మండలం సుంకేసులలో ఉమాశంకర్‌రెడ్డి ఇల్లు, ప్రొద్దుటూరులోని ఆయన సోదరుడు జగదీశ్వరరెడ్డి ఇంటిలోనూ సోదాలు చేశారు. అనంతరం దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు,  వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నిన్న సీబీఐ అధికారులను కలిశారు.
 
కాగా,  తమ ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీల అనంతరం సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసుకు, తమకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. సింహంలాంటి వివేకానందరెడ్డిని చిట్టెలుకలాంటి తమ లాంటి వారు చంపలేరని అన్నారు. సింహాన్ని మరో సింహమే చంపి ఉంటుందంటూ పరోక్షంగా ఈ ఘటన వెనక పెద్ద తలకాయలు ఉన్నట్టు చెప్పారు. వివేకానందరెడ్డిని చంపిందెవరో అందరికీ తెలుసన్న ఆయన సీబీఐ అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని, చూస్తుంటే ఈ కేసులో తమను ఇరికించేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News