CM KCR: చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం కేసీఆర్

  • నేడు జాతీయ చేనేత దినోత్సవం
  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
  • చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడి
  • ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరణ
CM KCR wishes hand loom craftsmen on national hand loom day

ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు, పద్మశాలీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామని, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులు అందిస్తున్నామని వెల్లడించారు. ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు.

రుణమాఫీ పథకం, నేతన్నలకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాల ద్వారా చేనేత సొసైటీలకు వాటా ధనం అందించడం, నూలు, రంగులు, రసాయనాలపై సబ్సిడీ, చేనేత మగ్గాల ఆధునికీకరణ వంటి చర్యలను తమ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు.

ప్రభుత్వ దార్శనికత, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో గత పాలనలో కునారిల్లిన చేనేత రంగాన్ని అనతికాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించి, వారి సంపాదన పెంచి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు.

More Telugu News