Guntur District: మొత్తానికి పోలీసులకు చిక్కిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసు నిందితుడు

  • గుంటూరు జిల్లా సీతానగరంలో జూన్‌లో ఘటన
  • వివిధ వేషాల్లో తిరుగుతూ నిందితుల కోసం గాలింపు
  • గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో విచారణ
  • మరో నిందితుడు చెన్నైలో ఉన్నట్టు సమాచారం
Police nabbed seethanagaram gang rape accused

సంచలనం సృష్టించిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఒక నిందితుడిని పోలీసులు మారువేషాల్లో గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ఈ ఏడాది జూన్‌లో సాయంత్రం వేళ గుంటూరు జిల్లా సీతానగరం ఇసుక దిబ్బల వద్దకు సేద దీరేందుకు వెళ్లింది. వీరిని చూసిన నిందితులు జంటపై దాడిచేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను వెంకటరెడ్డి, షేర్ కృష్ణగా గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరు ఫోన్ ఉపయోగించకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారింది.

దీంతో పోలీసులు మారువేషాల్లో రంగంలోకి దిగారు. సమోసాలు అమ్మేవారిలా, ఫుడ్ డెలివరీ బాయ్స్‌లా మారి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులకు గంజాయి తాగే అలవాటు ఉండడంతో అది తాగే ప్రదేశాల్లోనూ కాపుకాశారు. ఈ క్రమంలో నిందితుడు కృష్ణ హైదరాబాద్‌లో క్యాటరింగ్ పనులు చేస్తూ రైల్వే బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నట్టు గుర్తించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న పోలీసు ప్రత్యేక బృందాలు షేర్ కృష్ణను అదుపులోకి తీసుకున్నాయి.

అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు అతడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మరో నిందితుడు చెన్నైలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసు బృందాలు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, విచారణ అనంతరం నిందితుడి అరెస్ట్‌ను అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.

More Telugu News