Rajasthan: యాచకులకు చక్కని జీవితాన్ని అందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న పథకం

  • వృత్తిపరమైన కోర్సుల్లో యాచకులకు శిక్షణ
  • 100 మందికి ఏడాదిపాటు శిక్షణ
  • 60 మందికి ఉద్యోగాలు
Rajasthan govt giving training for beggers and giving jobs

యాచకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ‘వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ లైఫ్ విత్ డిగ్నిటీ’ పేరుతో వారికి వృత్తిపరమైన కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తూ అనంతరం వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న 60 మంది యాచకులకు ఇటీవల ఉద్యోగాలు కల్పించింది.

రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆర్ఎస్ఎల్‌డీసీ) దీనిని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ నీరజ్ కె. పవన్ మాట్లాడుతూ.. యాచకులకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, రాష్ట్రంలో యాచకులు అనేవారే ఉండకూడదనేది ముఖ్యమంత్రి కల అని అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సూచన మేరకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.

ఇక ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 100 యాచకులకు సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వీరిలో 60 మందికి ఉద్యోగావకాశాలు కూడా కల్పించినట్టు చెప్పారు. మిగతా వారు ఇంకా శిక్షణ తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తొలుత వీరిని శిక్షణ కోసం సిద్ధం చేసేందుకు 20 రోజుల వరకు పట్టినట్టు వివరించారు. ఇటీవల 12 మంది యాచకులు ‘రెడ్‌పెప్పర్’ రెస్టారెంట్‌లో చేరారు. వారంతా ఆనందంగా పనిచేసుకుంటున్నారని రెస్టారెంట్ యజమాని తెలిపారు. మరికొందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

More Telugu News