CJI Ramana: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదంపై విచారణ.. సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

  • జల వివాదంపై విచారణ చేపట్టిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం
  • మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించిన సీజేఐ
  • తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని వ్యాఖ్య
CJI NV Ramana key comments on AP Telangana water dispute

కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది మాట్లాడుతూ... ఏపీ వేసిన పిటిషన్ పై విచారణ అవసరం లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ జారీ చేసిందని చెప్పారు. ఏపీ తరపు న్యాయవాది మాట్లాడుతూ... అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని... గెజిట్ ను ఇప్పటి నుంచే అమలు చేయాలని, కొన్ని నెలల పాటు నీటిని నష్టపోకూడదనే తాము అడుగుతున్నామని అన్నారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, తాను ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని చెప్పారు. జల వివాదం అంశాన్ని రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించి తాము పూర్తిగా సహకరిస్తామని... లేని పక్షంలో ఈ  పిటిషన్ ను వేర్ బెంచ్ కు బదిలీ చేస్తామని చెప్పారు. ఇరువైపు న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సమస్యను పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ వివాదంలో తాము అనవసరంగా జోక్యం చేసుకోదలుచుకోలేదని చెప్పారు.

దీంతో, ఏపీ తరపున హాజరైన న్యాయవాది దుష్యంత్ దవే సమయం కావాలని కోరగా... తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు తెలంగాణ తరపున న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోర్టుకు హాజరయ్యారు.

More Telugu News