America: అలాస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

  • రిక్టర్ స్కేలుపై 8.2గా తీవ్రత నమోదు
  • ఆ తర్వాత కాసేపటికే మరో రెండు ప్రకంపనలు
  • సునామీ హెచ్చరికలు జారీ చేసిన కాసేపటికే ఉపసంహరణ
earthquake off Alaskan peninsula tsunami warning

అమెరికాలోని అలాస్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. పెర్రీవిల్లే అనే చిన్న గ్రామానికి ఆగ్నేయంగా 91 కిలోమీటర్ల దూరంలో రాత్రి 8.15 గంటలకు భూకంపం సంభవించినట్టు యూఎస్‌జీఎస్ పేర్కొంది. సముద్ర తలానికి 46.67 కిలోమీటర్ల లోతున భూప్రకంపనలు సంభవించినట్టు తెలిపింది. ఇదే ప్రాంతంలో ఆ తర్వాత కాసేపటికే 6.2, 5.6 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించింది.

కాగా, సునామీ హెచ్చరికలను జారీ చేసిన కాసేపటికే వాటిని రద్దు చేశారు. అలాగే, హువాయి, అమెరికన్ సమోవా, గ్వాల్‌కు జారీ చేసిన హెచ్చరికలు కూడా రద్దయ్యాయి. తాజా భూకంపం కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదు. గతేడాది అక్టోబరులో ఇక్కడే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 1964లో 9.2 తీవ్రతతో సంభవించిన భూకంపం మాత్రం పెను విలయాన్నే సృష్టించింది. ఈ భూకంపం కారణంగా గల్ఫ్ ఆఫ్ అలాస్కా, అమెరికా పశ్చిమ తీరం, హవాయిలో సునామీ సంభవించింది. భూకంపం, సునామీ కారణంగా 250 మందికిపైగా మరణించారు.

More Telugu News