Dholavira: గుజరాత్ లోని ప్రాచీన నగరం 'ధోలావిరా'కు యునెస్కో గుర్తింపు... ప్రధాని మోదీ హర్షం

  • హరప్పా నాగరికతలో గొప్ప నగరంగా ధోలావిరా
  • ప్రపంచ వారసత్వ స్థలంగా ఎంపిక
  • గుజరాత్ లో మూడుకు పెరిగిన వారసత్వ స్థలాలు
  • గతంలో చంపానీర్, అహ్మదాబాద్ లకు గుర్తింపు
Ancient city Dholavira gets UNESCO world heritage site tag

ఇటీవల తెలంగాణలోని రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపునిచ్చిన యునెస్కో తాజాగా గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావిరాకు కూడా విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావిరా ఓ మహానగరంగా వర్ధిల్లింది. ధోలావిరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు నేడు యునెస్కో ఓ ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ 44వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో, భారత్ కు చెందిన పలు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపునివ్వాలన్న నిర్ణయాలు కూడా ఉన్నాయి.

కాగా, యునెస్కో తాజా ప్రకటన అనంతరం గుజరాత్ లోని ప్రపంచ వారసత్వ స్థలాల సంఖ్య మూడుకు పెరిగింది. పావ్ గఢ్ సమీపంలోని చంపానీర్, చారిత్రక అహ్మదాబాద్ నగరం ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ స్థలాలుగా యునెస్కో జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ధోలావిరా నగరం కూడా వీటి సరసన చేరింది.

ధోలావిరాకు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఓ చారిత్రక నగరానికి విశిష్ట గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని తెలిపారు.

ధోలావిరా ఓ ముఖ్యమైన నాగరికత కేంద్రమని, చరిత్రతో మనకున్న గొప్ప అనుసంధానం ఈ నగరం అని వివరించారు. చరిత్ర, సంస్కృతి, పురావస్తు అంశాలపై ఆసక్తి ఉన్నవాళ్లు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రాంతం అని పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ధోలావిరాలో పర్యటించానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ధోలావిరాలోని ప్రాచీన నిర్మాణాల పరిరక్షణకు కృషి చేశానని తెలిపారు.

More Telugu News