Sajjala Ramakrishna Reddy: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి: సజ్జల జోస్యం

  • నిన్న ఏలూరు కార్పొరేషన్ లో ఓట్ల లెక్కింపు
  • 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం
  • ఎన్నికల్లో 44 డివిజన్లు గెలిచిన వైసీపీ
  • టీడీపీకి 3 డివిజన్లలో విజయం
  • వైసీపీకి 56.3 శాతం ఓటింగ్ వచ్చిందన్న సజ్జల
  • టీడీపీ 28.2 శాతానికే పరిమితమైందని వెల్లడి
Sajjala responds on Eluru Corporation results

ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తీరులో ఫలితాలు వస్తాయని ధీమాగా చెప్పారు.

ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, మొదట్లోనే 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించగా, కోర్టు ఆదేశాలతో కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిన్న ఓట్ల లెక్కింపు నిర్వహించగా వైసీపీ 44 డివిజన్లు చేజిక్కించుకోగా, టీడీపీకి 3 డివిజన్లలో విజయం లభించింది.

దీనిపై సజ్జల స్పందిస్తూ, ఏలూరు ప్రజలంతా ఒకే మాటగా వైసీపీకి ఓటేశారని, తద్వారా సీఎం జగన్ ను దీవించారని వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజారంజక పాలనకు ఇది తాజా నిదర్శనం అని పేర్కొన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా తమ పాలన కొనసాగుతోందని వెల్లడించారు. ఏలూరులో 56.3 శాతం ప్రజలు వైసీపీకి ఓటేశారని, టీడీపీ కేవలం 28.2 శాతానికే పరిమితమైందని అన్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని స్పష్టం చేశారు.

More Telugu News