Rajdhani Express: రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల బోగీలకు కొత్త హంగులు

  • తేజస్ రైళ్ల తరహాలో రాజధాని బోగీలు
  • స్మార్ట్ ఫీచర్లతో ముస్తాబు
  • ప్రథమంగా ముంబయి-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ కి స్మార్ట్ బోగీలు
  • త్వరలోనే అన్ని రాజధాని ఎక్స్ ప్రెస్ లకు ఏర్పాటు
Smart features in Rajdhani express train coaches

రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల బోగీలు త్వరలోనే కొత్త హంగులు సమకూర్చుకోబోతున్నాయి. వీటిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆధునికీకరించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో స్మార్ట్ బోగీలతో కూడిన ముంబయి-రాజధాని ఎక్స్ ప్రెస్ నిన్న ప్రయోగాత్మకంగా ముంబయి నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించింది. ఈ బోగీలకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. రైలు కదిలేవరకు మూసుకోవు. ఈ స్మార్ట్ బోగీల్లో మంటలు అంటుకోని ఫైర్ రెసిస్టెంట్ సిలికాన్ ఫోమ్ సీట్లు ఏర్పాటు చేశారు. పైగా ఇవి ఎంతో హాయినిచ్చేలా రూపొందించారు.

ప్రతి సీటు వద్ద మొబైల్ ఫోన్ చార్జర్, అప్పర్ బెర్తుల వాళ్లు సులభంగా ఎక్కేలా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి కంపార్ట్ మెంట్ లోనూ 24 గంటలూ పనిచేసేలా సీసీ టీవీ కెమెరాలు పొందుపరిచారు. బయో వాక్యూమ్ టాయిలెట్లు, పానిక్ బటన్లు, కుదుపుల్లేని ప్రయాణం కోసం నాణ్యమైన ఎయిర్ సస్పెన్షన్, హెచ్ వీఏసీ (ఎయిర్ కండిషనింగ్) వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

దేశంలో అత్యాధునిక రైళ్లుగా పేరుగాంచిన తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇలాంటి బోగీలే ఉంటాయి. ఇప్పుడు రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల బోగీలను కూడా తేజాస్ స్థాయికి అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే అన్ని రాజధాని ఎక్స్ ప్రెస్ లకు ఈ తరహా స్మార్ట్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News