Chalo Tadepalli: నిరుద్యోగ సంఘాల 'ఛలో తాడేపల్లి'కి అనుమతి నిరాకరణ

  • ఎల్లుండి ఛలో తాడేపల్లి
  • అనుమతి లేదన్న గుంటూరు ఎస్పీ
  • 144 సెక్షన్ అమల్లో ఉందని వివరణ
  • విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకోవాలని వెల్లడి
Police rejects permission to Chalo Tadepalli

ఏపీలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటితో కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఈ నెల 19న 'ఛలో తాడేపల్లి' నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అయితే, 'ఛలో తాడేపల్లి' కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్టు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారి పనులకు ఆటంకం కలిగించడం నేరం అని ఎస్పీ పేర్కొన్నారు. సీఎంవో, రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం ముట్టడించడం నేరం అని వివరించారు. నిరుద్యోగుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

మరోవైపు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా ఆందోళన చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు.

More Telugu News