Telangana: నడుస్తున్న రైలు నుంచి కిందపడిన ఆరేళ్ల చిన్నారి.. స్థానికులు గుర్తించడంతో తప్పిన ప్రాణాపాయం

  • తెలంగాణలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • రెండు ట్రాకుల మధ్య పడిపోయి ఏడుస్తున్నచిన్నారి
  • రెండు కాళ్లకు ఫ్రాక్చర్ కావడంతో హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయం
  • కుటుంబ సభ్యులే తోసివేసి ఉంటారన్న కోణంలో విచారణ
6 years Old girl fall down from running train near peddapalli railway station

నడుస్తున్న రైలు నుంచి కిందపడిన ఆరేళ్ల చిన్నారి గాయాలతో బయటపడింది. తెలంగాణలోని పెద్దపల్లి స్టేషన్ సమీపంలో జరిగిందీ ఘటన. నిన్న ఉదయం ఏడు గంటల సమయంలో గొల్లపల్లి శివారులో రెండు రైల్వే ట్రాకుల మధ్యన  రాళ్లపై పడిన చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే సమీపంలోని రైల్వే గేట్‌మన్, బసంత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించి చిన్నారిని అంబులెన్స్‌లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారిని పరీక్షించిన వైద్యులు చిన్నారి కాళ్లకు నాలుగు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. చిన్నారి ముఖానికీ గాయాలయ్యాయి.

చిన్నారికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని నిర్ణయించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు చిన్నారి ఉదయం 6 గంటలకు రైలు నుంచి కిందపడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎటువైపు వెళ్లే రైలు నుంచి చిన్నారి పడిపోయి ఉంటుందన్న విషయంలో స్పష్టత లేకపోవడం, పాప మాట్లాడలేకపోతుండడంతో ఆమె వివరాలు తెలియరావడం లేదని పోలీసులు తెలిపారు. చిన్నారి ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిందా? లేక, కుటుంబ సభ్యులే ఆమెను రైలు నుంచి తోసివేసి ఉంటారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

More Telugu News