Jagan: చంద్రబాబుకు, ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడుతున్న తెలంగాణ మంత్రులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా: సీఎం జగన్

  • అనంతపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
  • హాజరైన సీఎం జగన్
  • నీటి వివాదాలపై స్పందన
  • మా నీటినే మేం వాడుకుంటున్నామని వెల్లడి
  • ఎవరితో విభేదాలు కోరుకోవడంలేదని స్పష్టీకరణ
Jagan comments on Chandrababu and Telangana ministers

అనంతపురంలో సీఎం జగన్ ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణతో నీటి వివాదాలపై స్పందించారు. తెలంగాణతో జల వివాదాలు అందరికీ తెలిసిన విషయమేనని, అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నాలుగైదు రోజులు ఈ అంశంపై మౌనంగా ఉండి, ఇప్పుడిప్పుడే దీనిపై మాట్లాడుతున్నాడని అన్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తాను చంద్రబాబుకు, ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడుతున్న తెలంగాణ మంత్రులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానని అన్నారు.

"దశాబ్దాల తరబడి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ... ఈ మూడూ కలిసిందే ఆంధ్ర రాష్ట్రం. కృష్ణా నదీ జలాలు కోస్తాంధ్రకు ఎంత, తెలంగాణకు ఎంత, రాయలసీమకు ఎంత అనే విభజన ప్రకారమే మొదటి నుంచి కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాక 2015 జూన్ 19వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఈ నీటి కేటాయింపులపై సంతకాలు చేసింది. ఏపీ, తెలంగాణ, కేంద్రం... ఈ మూడూ సంతకాలు చేసిన ప్రకారం... రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు.

ఇప్పుడు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. అందరూ రాయలసీమ పరిస్థితిని గమనించండి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి రావాలంటే నీటిమట్టం 881 అడుగులు చేరాలి. లేకపోతే పూర్తిస్థాయిలో నీళ్లు రావు. శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యం ఎంతంటే 885 అడుగులు. నేను సీఎం అయ్యాక ఈ రెండేళ్లు వర్షాలు బాగా పడ్డాయి. ఆ రెండేళ్లను వదిలేస్తే, అంతకుముందు 20 ఏళ్లుగా శ్రీశైలం డ్యామ్ లో 881 అడుగుల పైచిలుకు నీటిమట్టం ఎన్నిరోజులు ఉందన్న విషయం పరిశీలిస్తే, 20-25 రోజులు ఉందని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలంటే ఏంచేయాలి? మరోవైపు తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి సామర్థ్యం పెంచి వాడుకుంటున్నారు. వాటన్నింటి నుంచి 800 అడుగుల లోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. 796 అడుగుల్లోపే తెలంగాణకు విద్యుదుత్పాదన చేసే సౌకర్యం ఉంది.

ఇలాంటప్పుడు 800 అడుగుల లోపే మీకు కేటాయించిన నీరు వాడుకున్నప్పుడు తప్పులేనప్పుడు, మరి మేము 881 అడుగులకు నీటిమట్టం చేరుకుంటే తప్ప వాడుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మేం రాయలసీమ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే తప్పేంటి అని అడుగుతున్నా. మాకు హక్కుగా కేటాయించిన నీటినే మేం వాడుకుంటుంటే మీకు అభ్యంతరం ఏంటి అని ప్రతి పాలకుడిని అడుగుతున్నా.

చంద్రబాబుకు ఇంకాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా. గతంలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు, అవతల తెలంగాణకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంటే నువ్వేం గాడిదలు కాస్తున్నావు చంద్రబాబూ? అని అడుగుతున్నా.

మా ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకుంటోంది ఎవరి వాటా నీళ్లు తీసుకోవడానికి కాదు. రైతులకు ఉపయోగపడే నీళ్ల విషయంలో రాజకీయాలు జరగడం బాధాకరం. అయితే మేం ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతోనూ విభేదాలు కోరుకోవడం లేదు. మేం పాలకుల మధ్య సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నాం. ఈ జగన్ ఎప్పుడూ అలాగే కోరుకుంటాడు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి పక్క రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టబోను. రాబోయే రోజుల్లోనూ నా వైఖరి ఇలాగే ఉంటుంది. అందరితోనూ మంచినే కోరుకుంటున్నా" అని సీఎం జగన్ ఉద్ఘాటించారు.

More Telugu News