Sanchaita: ఏపీ మహిళా కమిషన్ ను ఆశ్రయించిన సంచయిత... అశోక్ గజపతిరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ

  • మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా మళ్లీ అశోక్ గజపతిరాజు
  • కించపరిచేలా మాట్లాడారంటూ సంచయిత ఆరోపణ
  • తన వారసత్వాన్ని కూడా అవమానిస్తున్నారని ఫిర్యాదు
  • అశోక్ అనాగకరికంగా వ్యవహరిస్తున్నారన్న పద్మ   
Sanchaita complains against Ashok Gajapathi to AP Women Commission

ఇటీవల అశోక్ గజపతిరాజును మాన్సాస్, సింహాచలం ట్రస్టు చైర్మన్ గా పునర్ నియమించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం అశోక్ గజపతిరాజు తన ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్నిరోజులపాటు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, ఓ మహిళనైన తనను అశోక్ గజపతిరాజు కించపరిచేలా మాట్లాడారంటూ సంచయిత గజపతి ఆరోపిస్తున్నారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఈ మేరకు ఆమె ఏపీ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తన నియామకంతో పాటు తన వారసత్వాన్ని కూడా అవమానించే రీతిలో అశోక్ గజపతిరాజు మాట్లాడారని సంచయిత పేర్కొన్నారు. విశాఖలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసిన సంచయిత ఫిర్యాదు పత్రం అందించారు. దీనిపై స్పందించిన వాసిరెడ్డి పద్మ... అశోక్ గజపతిరాజుపై నిప్పులు చెరిగారు.

అశోక్ గజపతిరాజు ఇంకా రాచరికపు పోకడలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సంచయిత ఆరోపణల నేపథ్యంలో అశోక్ గజపతిరాజు చర్చకు రావాలని అన్నారు. మాన్సాస్ ట్రస్టు నిబంధనలు, విధివిధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పద్మ స్పష్టం చేశారు. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు అనాగకరికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News