ESA: రోదసిలోకి దివ్యాంగ ఆస్ట్రోనాట్​.. పంపిస్తామన్న యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ

  • ప్రపంచంలోనే తొలి మిషన్
  • వందలాది దరఖాస్తులు వచ్చాయన్న సంస్థ అధిపతి
  • అంతరిక్షం ప్రతి ఒక్కరిదని కామెంట్
ESA Announces Plans To Send Disabled Astronauts To Space

నేల, నింగి, నీరు ప్రతి ఒక్కరిదీ అంటారు. అలాగే అంతరిక్షం కూడా అందరిదీ అంటోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ). మామూలుగా అంతరిక్షంలోకి పంపేవారికి ఎన్నెన్నో పరీక్షలు పెడతారు. శరీర దృఢత్వం, మానసిక ఆరోగ్యం వంటి వాటిని పరిశీలిస్తారు. అక్కడి వాతావరణానికి తట్టుకునేలా, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా బతికేలా శిక్షణనిస్తారు. అలాంటి వాతావరణంలోకి దివ్యాంగులు వెళ్లడమంటే మామూలు మాటలు కాదు!

కానీ, దానిని నిజం చేసి చూపిస్తామని ఈఎస్ఏ తేల్చి చెబుతోంది. త్వరలో ప్రపంచంలోనే తొలి దివ్యాంగ వ్యోమగామి (ఆస్ట్రోనాట్)ను రోదసిలోకి పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అందుకు వందలాది దరఖాస్తులూ వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఈఎస్ఈ అధిపతి జోసఫ్ యాష్బాకర్ వెల్లడించారు. త్వరలో 22 మందితో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగానికి సంబంధించి ఆస్ట్రోనాట్ల తాజా నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. దాదాపు 22 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు.

‘‘ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ప్రయోగంలో మేము ఓ దివ్యాంగుడిని అంతరిక్షంలోకి పంపించేందుకు నిర్ణయించాం’’ అరి ఆయన వివరించారు. ఈఎస్ఏ దృష్టిలో ‘అంతరిక్షం అందరిది’ అని, అదే విషయాన్ని తాను చెబుతున్నానని అన్నారు. అంతరిక్ష రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ వేగాన్ని అందుకునేలా ముందుకెళ్లాలని, లేదంటే వెనకబడిపోతామని ఆయన చెప్పారు.

అంతరిక్ష రంగంలో యూరోపియన్ స్టార్టప్ లు పెరిగేలా వెంచర్ క్యాపిటలిస్టులతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. ఏదో ఒక రోజు సిలికాన్ వ్యాలీలోని వ్యాపారవేత్తలకు దీటుగా నిలబడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News