Corona Virus: ఈ మూడింటితో ఏ కరోనా వేరియంట్‌నైనా అడ్డుకోగలం: ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా

  • కట్టడి ప్రోటోకాల్‌, లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌తో వేరియంట్లకు చెక్‌
  • డెల్టా ప్లస్‌ ఇబ్బందులపై ఇప్పుడే చెప్పలేం
  • మూడో వేవ్‌ రాకుండా అప్రమత్తంగా ఉండాలి
  • దశలవారీగా పాఠశాలలు తెరవాలని సూచన
we can check virus with covid protocol lockdown vaccination says randeep guleria

కొవిడ్‌-19 కట్టడి ప్రోటోకాల్‌, లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ వల్ల ఏ కరోనా వేరియంట్‌నైనా సమర్థంగా నియంత్రించగలమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ దేశంలో ఇబ్బందులు సృష్టిస్తోందని చెప్పడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, స్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దన్నారు. ఎక్కడ కేసులు వెలుగులోకి వచ్చినా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మూడో వేవ్‌ రాకుండా అప్రమత్తంగా ఉంటూ కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ను పాటించాలన్నారు.

దేశవ్యాప్తంగా మూడో వేవ్‌ ముప్పు ఉందన్న విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండో వేవ్‌లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్న భారత్‌లో మూడో వేవ్‌పై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

అయితే, క్రమంగా పాఠశాలలు తెరవడంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలని గులేరియా సూచించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దశలవారీగా తరగతుల్ని ప్రారంభించాలన్నారు. ఇక వ్యాక్సినేషన్‌ విషయానికి వస్తే భారత్‌లో ఇంకా వృద్ధులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు.

పిల్లల కోసం వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయని.. సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక వైరస్‌ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూనే ఉంటుందని.. వాటిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. వేగంగా వ్యాపిస్తేనే వాటిని ఆందోళనకర రకాలుగా గుర్తిస్తామన్నారు.

More Telugu News