CPI Ramakrishna: కరోనా సంక్షోభ సమయంలో ఆస్తి పన్ను పెంచుతారా?: సీపీఐ రామకృష్ణ

  • పన్నులు పెంచుతూ జీవోలు
  • జీవోలను వెనక్కి తీసుకోవాలన్న రామకృష్ణ
  • పన్నుల పెంపు ప్రజలపై భారం మోపుతుందని వెల్లడి
  • పన్నుల పెంపుపై ప్రజాసంఘాల ఆగ్రహం
CPI Ramakrishna reacts to taxes hike in urban areas

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలో పన్నులు పెంపు సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర సమయంలో ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపు ప్రజలకు గుదిబండ వంటిదని పేర్కొన్నారు. పన్ను పెంచుతూ జారీ చేసిన 197, 198 జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పన్ను పెంపును నిరసిస్తూ ఈ నెల 8, 9వ తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

అటు, పలు ప్రజాసంఘాలు కూడా ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరల పెంపుతో సతమతమవుతున్న సమయంలో, పన్నులు పెంచడం సరికాదని నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు.

పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్. బాబూరావు దీనిపై స్పందించారు. పట్టణాల్లో ఉచితంగా అందించాల్సిన సేవల్లో పారిశుద్ధ్య సేవలు కూడా ఉన్నాయని, అలాంటి సేవలపై చెత్త పన్ను పేరిట భారం మోపుతున్నారని విమర్శించారు. అంతేగాకుండా, అద్దె విలువల ఆధారిత ఆస్తి పన్ను ఉండగా, దాని స్థానంలో మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాలని ప్రభుత్వం భావించడం సరికాదని హితవు పలికారు.

More Telugu News